Gujarat Morbi Bridge Collapse: Officials Suspect Missing Over 100 - Sakshi
Sakshi News home page

మోర్బీ వారధి విషాదం: మృతుల్లో 47 మంది పిల్లలు.. మరో వంద మందికిపైగా జలసమాధి!

Published Mon, Oct 31 2022 8:31 PM | Last Updated on Mon, Oct 31 2022 9:02 PM

Gujarat Morbi bridge collapse: Officials Suspect Missing Over 100 - Sakshi

న్యూఢిల్లీ: సరదా.. పెను విషాదాన్నే మిగిల్చింది. గుజరాత్‌ మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి కుప్పకూలిన ప్రమాదంలో.. మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఘటన సమయంలో ఐదు వందల మందికి పైగా బ్రిడ్జి మీద ఉన్నట్లు ఒక అంచనా. ఇప్పటిదాకా 140 మందికిపైగా మృతదేహాలను వెలికి తీశాయి సహాయక సిబ్బంది. ఈ తరుణంలో.. సోమవారం చీకటి పడడంతో ఇవాళ్టికి రెస్క్యూ ఆపరేషన్‌ నిలిపి వేశారు. తిరిగి మంగళవారం ఉదయం సహాయక చర్యలు చేపడతామని వెల్లడించారు అధికారులు. 

ఇక ఘటనకు సంబంధించి గాయపడిన వాళ్లకు చికిత్స అందుతుండగా.. మరో వంద మందికిపైగా జాడ లేకుండా పోయినట్లు తెలుస్తోంది. దీంతో బుదర, మురికితో కూడి ఉన్న మచ్చు నది నీళ్లలో వందకుపైగా మృతదేహాలు చిక్కుకుని ఉంటాయని భావిస్తున్నారు. 

బ్రిటిష్‌ కాలం నాటి బ్రిడ్జికి.. ఏడు నెలలపాటు మరమ్మతుల పనులు జరిగాయి. అయితే.. రూల్స్‌ ప్రకారం ఎనిమిది నుంచి 12 నెలల పనుల తర్వాతే బ్రిడ్జి ప్రారంభం కావాలి. కానీ, గడువు కంటే ముందుగానే బ్రిడ్జిని అక్టోబర్‌ 26వ తేదీన  ప్రారంభించారు నిర్వాహకులు. ఆదివారం సాయంత్రం బ్రిడ్జి కూలిన ఘటన చోటు చేసుకోగా.. ఇప్పటివరకు 141 మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాల్లో రెండేళ్ల చిన్నారి సహా 47 మంది చిన్నారుల బాడీలు ఉన్నట్లు గుర్తించారు.

    

వారాంతం కావడంతో ఒక్కసారిగా బ్రిడ్జి మీదకు ఎక్కువ సంఖ్యలో జనాలు చేరారని ఫోరెన్సిక్‌ ల్యాబోరేటరీ ప్రమాదానికి గల కారణాలు గుర్తించింది. బ్రిడ్జి నిర్మాణం నమునాను సైతం గ్యాస్‌ కట్టర్‌ల సాయంతో సేకరించి మరీ పరిశీలిస్తోంది బృందం. అయితే పది నుంచి పదిహేను మంది కుర్రాళ్లు.. బ్రిడ్జిని ఒక్కసారిగా ఊపేశారని అందుకే ప్రమాదం జరిగిందంటూ ఓ బాధితుడు మీడియాకు వెల్లడించాడు. 

మోర్బీ మున్సిపల్ అథారిటీ, అజంతా మానుఫ్యాక్చరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మధ్య మొత్తం పదిహేనేళ్ల పాటు కాంట్రాక్ట్‌ జరిగింది. ఇందులో భాగంగా గుజరాత్‌కు చెందిన వాచ్‌తయారీ కంపెనీ ఒరెవా గ్రూప్‌ బ్రిడ్జిని మెయింటెన్‌ చేస్తూ.. టికెట్‌ల మీద వచ్చే కలెక్షన్స్‌ను తీసుకుంటోంది. ఒక్కో వ్యక్తికి రూ.12-రూ.17 చొప్పున వసూలు చేస్తూ వస్తోంది. 

ఒరెవా గ్రూప్‌.. దేవ్‌ప్రకాశ్‌ సొల్యూషన్స్‌ అనే ఓ చిన్న కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి రినోవేషన్‌ బాధ్యతలను అప్పజెప్పింది.  ఇక బ్రిడ్జి పునప్రారంభం గురించి మోర్బీ మున్సిపాలిటీకి ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది.  అయితే ఒరెవా మాత్రం సుమారు 2 కోట్ల రూపాయలతో.. ఏడు నెలల్లోనే పటిష్టంగా పనులు జరిపినట్లు ప్రకటించుకుంది.

ఒక్కసారిగా చేరిన జనం.. కొందరు కావాలని ఊగిపోవడంతో.. మెటల్‌ కేబుల్స్‌ తెగిపోయి ఈ ఘోర ప్రమాదం జరిగిందని వీడియో ఆధారంగా తెలుస్తోంది. 

ఒరెవా మాత్రం.. ఒకవేళ జనాలు డ్యామేజ్‌ చేస్తే తప్పించి తాము చేపట్టిన రినోవేషన్‌ పనులకు ఎనిమిది ఏళ్ల మినిమమ్‌ గ్యారెంటీ నుంచి గరిష్టంగా పదిహేనేళ్ల గ్యారెంటీ ఉంటుందని ఒక ప్రకటన విడుదల చేసింది. అదీ బ్రిడ్జి ప్రారంభం కాకముందే.. 24వ తేదీనే కావడం గమనార్హం.

ఇక ఈ ఘటనకు సంబంధించి కాంట్రాక్ట్‌తో పాటు తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అయిన వాళ్లలో ఇద్దరు ఒరెవా గ్రూప్‌ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇక కంపెనీకి సంబంధించిన ప్రధాన అధికారులు పరారీలో ఉన్నారన్న కథనాలపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో  ఎంతటి వాళ్లనైనా ఉపేక్షించేది లేదంటూ గుజరాత్ పోలీసులు ప్రకటించారు. ప్రత్యేక విచారణ బృందం (SIT) ద్వారా మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదం కేసు దర్యాప్తు ముందుకు సాగుతోంది. 

ఇదీ చదవండి: మోర్బీ తరహాలో దేశంలో జరిగిన విషాదాలు ఇవే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement