
అహ్మదాబాద్: తనను తానే వివాహమాడబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమాబిందు(24) తన పెళ్లి వేడుకను బుధవారం సాయంత్రం సొంతింట్లోనే జరుపుకున్నట్లు వెల్లడించింది. తన స్వీయ వివాహం(సోలోగమీ) వ్యవహారం మరింత వివాదస్పదంగా మారకూడదనే మూడు రోజులు ముందుగానే జరుపుకున్నట్లు గురువారం మీడియా ఎదుట ప్రకటించింది. వడోదరలోని గోత్రి ప్రాంతానికి చెందిన క్షమాబిందు దగ్గర్లోని ఆలయంలో ఈనెల 11వ తేదీన వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.
‘ఇలాంటి పెళ్లిళ్లు ఏ గుడిలో జరిగినా అడ్డుకుంటామంటూ బీజేపీ వడోదర విభాగం ఉపాధ్యక్షురాలు సునీతా శుక్లా హెచ్చ రించారు. హిందూ యువతను పెడదోవ పట్టిస్తోందంటూ నన్ను తప్పుబట్టారు. వైదిక సంప్రదాయంలో పెళ్లి తంతును జరిపించేందుకు పూజారి నిరాకరించారు’ అని ఆమె తెలిపింది. దీంతో ఇంట్లోనే పెళ్లి జరుపుకుంది. ఈ కార్యక్రమం వీడియోను విడుదల చేసింది. సంప్రదాయ వివాహ వేడుక మాదిరిగానే జరిగిన ఈ కార్యక్రమానికి కొద్ది మంది సన్నిహితులు హాజరైనట్లు తెలిపింది. తన వివాహం దేశంలోనే మొట్టమొదటిదని క్షమాబిందు అంటోంది. త్వరలో హనీమూన్‌కూ వెళ్తానని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment