లండన్‌ ఆర్టిస్టుతో హరీష్‌ సాల్వే రెండోపెళ్లి | Harish Salve To Marry London Based Artist On October 28 | Sakshi
Sakshi News home page

లండన్‌ మహిళతో హరీష్‌ సాల్వే వివాహం

Published Tue, Oct 27 2020 11:30 AM | Last Updated on Tue, Oct 27 2020 11:38 AM

Harish Salve To Marry London Based Artist On October 28 - Sakshi

కాబోయే భార్యతో హరీష్‌ సాల్వే(ట్విటర్‌ ఫొటో)

లండన్‌: ప్రముఖ న్యాయవాది, భారత మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీష్‌ సాల్వే, లండన్‌ ఆర్టిస్టు కరోలిన్‌ బ్రొసార్డ్‌ను వివాహం చేసుకోనున్నారు. లండన్‌లోని చర్చిలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య బుధవారం వీరి పెళ్లి జరుగనుంది. వీరిరువురికి ఇది రెండో వివాహం. హరీష్‌ సాల్వే గతంలో మీనాక్షిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు కూతుళ్లు సాక్షి సాల్వే, సానియా సాల్వే సంతానం. కాగా ఈ ఏడాది జూన్‌లో హరీష్‌ సాల్వే, తన భార్య మీనాక్షికి విడాకులు ఇచ్చారు. ఇక యూకేకు చెందిన ఆర్టిస్టు కరోలిన్‌ బ్రొసార్డ్‌(56)కు 18 ఏళ్ల కూతురు ఉన్నారు. 

కాగా సుప్రీంకోర్టు న్యాయవాది అయిన హరీష్‌ సాల్వే, ఈ ఏడాది జనవరిలో కోర్ట్స్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్వీన్స్‌ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. ఈ క్రమంలో, ప్రస్తుతం యూకేలో నివసిస్తున్న ఆయన, ఓ ఆర్ట్‌ ఈవెంట్‌లో కరోలిన్‌ను కలిసినట్లు తెలుస్తోంది. థియేటర్‌, శాస్త్రీయ సంగీతం పట్ల అభిరుచి వీరిద్దరిని సన్నిహితులను చేసినట్లు సమాచారం. ఇక తాను వివాహం  చేసుకోనున్నట్లు 65 ఏళ్ల హరీష్‌ సాల్వే సోమవారం ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీష్‌ సాల్వేకు తోటి న్యాయవాదులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (చదవండి: భావోద్వేగం: ‘ఒక్క రూపాయి ఫీజు కోసం ఇంటికి రమ్మన్నారు’)

ఒక్క రూపాయి ఫీజు
1955లో మహారాష్ట్రలో జన్మించిన హరీష్‌ సాల్వే సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేసిన విషయం తెలిసిందే. అదే విధంగా భారత సొలిసటర్‌ జనరల్‌గా విధులు నిర్వర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో భారత్‌ గెలిచే విధంగా తన వాదనలు వినిపించి ప్రఖ్యాతి గడించారు. కుల్‌భూషణ్‌ విషయంలో.. పాకిస్తాన్‌ వక్రబుద్ధిని బట్టబయలు చేస్తూ.. ఐసీజే ముందు వారి కుట్రలను వివరించారు. దీంతో న్యాయస్థానంలోని 16 మంది న్యాయమూర్తుల్లో 15 మందిని ఒప్పించగలికారు. సుదీర్ఘ కాలం పాటు సాగిన కేసు విచారణలో.. ఎట్టకేలకు భారత్‌ పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. ఈ కేసు వాదించేందుకు గానూ కేవలం ఒక్క రూపాయి ఫీజు మాత్రమే తీసుకోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement