హరియాణాలో 61% పైగా పోలింగ్‌ | Haryana assembly polls: 61 per cent voter turnout recorded till 5 pm | Sakshi
Sakshi News home page

హరియాణాలో 61% పైగా పోలింగ్‌

Published Sun, Oct 6 2024 5:16 AM | Last Updated on Sun, Oct 6 2024 5:16 AM

Haryana assembly polls: 61 per cent voter turnout recorded till 5 pm

చండీగఢ్‌: హరియాణా అసెంబ్లీకి శనివారం జరిగిన పోలింగ్‌లో సాయంత్రం 5 గంటల సమయానికి 61%పైగా ఓటింగ్‌ నమోదైందని ఈసీ తెలిపింది. సాయంత్రం 6 గంటల సమయంలో కూడా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూలు కనిపిస్తున్నాయని, ఓటింగ్‌ శాతం పెరగనుందని పేర్కొంది. అత్యధికంగా నుహ్‌లో 68.28%, యమునానగర్‌లో 67.93% పల్వాల్‌లో 67.69%, జింద్‌లో 66.02%, సిర్సాలో 65.37% నమోదు కాగా, గురుగ్రామ్‌లో 49.92% మాత్రమే నమోదైనట్లు తెలిపింది.

పోలింగ్‌ సమయంలో నుహ్, హిసార్, పానిపట్‌ జిల్లాల్లో చిన్నపాటి ఘర్షణలు జరిగినట్లు ఈసీ తెలిపింది. కేంద్ర మంత్రి, మాజీ సీఎం ఖట్టర్‌ కర్నాల్‌లో ఓటేశారు. డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత మనూ భాకర్‌ ఝజ్జర్‌ జిల్లా గోరియా గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి వచ్చి మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీకి చెందిన కురుక్షేత్ర ఎంపీ నవీన్‌ జిందాల్‌ గుర్రంపై వచ్చి ఓటేశారు. జులానా నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న వినేశ్‌ ఫొగాట్‌ చర్ఖి దాద్రి జిల్లా బలాలిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

ఓటేయని గ్రామస్తులు 
చర్ఖి దాద్రి జిల్లాలో రామల్వాస్‌ గ్రామస్తులు శనివారం పోలింగ్‌ను బహిష్కరించారు. గ్రామ పరిసరాల్లో కొనసాగే గనుల అక్రమ తవ్వకాలతో తమ జల వనరులు అడుగంటాయని, పర్యావరణానికి హాని కలుగుతోందని ఆరోపిస్తున్నా రు. తవ్వకాలను అడ్డుకోవాలనే డిమాండ్‌తో వీరు ఓటేసేందుకు వెళ్లలేదు. ఓటర్లు ఎవరూ రాకపోయేసరికి గ్రామ పోలింగ్‌ బూత్‌లో సిబ్బంది అంతా సాయంత్రం వరకు ఖాళీగానే కూర్చున్నారు. అదే సమయంలో గ్రామస్తులు హుక్కా పీలుస్తూ, పేకాట ఆడుతూ సరదాగా కాలక్షేపం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement