ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ తొక్కిసలాట కేసులో సిట్ నివేదిక వెలువడింది. యూపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు సిట్ ఈ కేసుపై విచారణ జరిపింది. తాజాగా సిట్ ఈ నివేదికను హోం శాఖకు అందజేసింది. బాధ్యులందరి పేర్లు ఈ నివేదికలో ఉన్నాయి.
ఈ కేసులో 128 మందితో జరిపిన సంభాషణల ఆధారంగా సిట్ అధికారులు ఈ నివేదికను రూపొందించారు. ఇందులో సత్సంగంలో ప్రమాదం ఎలా జరిగింది? ఈ ప్రమాదానికి ఎవరు కారకులనేది వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ నివేదిక గోప్యంగా ఉంచారు. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు సీఎం ఆదేశించనున్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నివేదికపై సీనియర్ అధికారులతో చర్చించనున్నారు. ఏడీజీ ఏడీజీ అనుపమ కులశ్రేష్ఠ, అలీగఢ్ డివిజనల్ కమిషనర్ చైత్ర వి ఈ నివేదికను రూపొందించారు. సిట్ రూపొందించిన ఈ నివేదిక 850 పేజీలు ఉన్నట్లు సమాచారం.
ఇటీవల హత్రాస్‌లో బాబా సాకార్ హరి అలియాస్ భోలే బాబా సత్సంగం సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 123 మంది ప్రాణాలు కోల్పోయారు. భోలే బాబా పాదాలను పూజించేందుకు భక్తులు ఒక చోట గుమిగూడిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతిచెందిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు.
మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు అందజేస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ కేసులో ఆర్గనైజింగ్ కమిటీతో సంబంధం కలిగినవారిని అరెస్టు చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో బాబా పేరు లేదు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఘటనాస్థలికి వెళ్లారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment