ఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ విచారణ కోసం లిస్ట్ చేయాలని సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. దీంతో సుప్రీం కోర్టు రిజిస్ట్రీ జూలై 12న (శుక్రవారం) పిటిషన్ విచారణను షెడ్యూల్ చేసింది.
ఈ నెల 2న హత్రాస్‌లో భోలే బాబా సత్సంగ్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటల ఘటనలో 121 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు లాయర్ విశాల్ తివారీ.. అత్యున్నంత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
అదే విధంగా ఈ ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై నివేదిక తయారు చేసి బాధ్యులపై చర్యలు తీసుకునేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.
మరోవైపు.. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఇవాళ తన నివేదికను వెల్లడించింది. తొక్కిసలాట ప్రమాదానికి ఆర్గనైజర్ల నిర్వహణ వైఫల్యమే కారణమని సిట్ ప్రాథమికంగా వెల్లడించింది. వాస్తవాలను దాచిపెట్టి నిర్వాహకులు సత్సంగ్ కార్యక్రమానికి అనుమతులు తీసుకున్నారని పేర్కొంది. షరతులు పాటించకుండ ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలను ఆహ్వానించారని తెలిపింది.
..పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు కనీస ఏర్పాట్లు చేయలేదని తెలిపింది. పోలీసు వెరిఫికేషన్ లేకుండానే వాలంటీర్లను నియమించుకున్నారని, భద్రతాపరమైన ఏర్పాట్లు కూడా లేవని పేర్కొంది. భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వారు బయటకు వెళ్లేందుకు బారికేడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. ప్రమాదం జరిగిన తర్వాత సత్సంగ్ నిర్వాహకుల కమిటీలోని సభ్యులు అక్కడినుంచి పారిపోయారని సిట్ తన నివేదికలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment