ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ హరి సాకర్ అలియాస్ భోలే బాబాపై తొలి కేసు నమోదైంది. పాట్నా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆయనపై కేసు నమోదైంది.
కాగా, జూలై 2న 121 మంది ప్రాణాలను బలిగొన్న హత్రాస్ తొక్కిసలాటలో ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. మధుకర్‌ను శనివారం స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. తొక్కిసలాట జరిగిన సత్సంగానికి చెందిన 'ముఖ్య సేవాదార్' మధుకర్ ప్రథమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఏకైక నిందితుడు. కాగా ఉత్తరప్రదేశ్ పోలీసులు మధుకర్‌ను పట్టుకునే వారికి రూ.లక్ష రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే
ఇక తొక్కిసలాట ఘటన తర్వాత భోలో బాబా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. జులై 2న జరిగిన ఘటనతో చాలా వేదనకు గురైనట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధను భరించే శక్తి ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించినట్లు చెప్పారు.
ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచాలని బాధితులకు సూచించారు. ఘటనకు కారకులను విడిచిపెట్టరనే విశ్వాసం తనకు ఉన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి అండగా ఉండాలని కమిటీ సభ్యులను అభ్యర్థించినట్లు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
మరోవైపు హత్రాస్ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు, తొక్కిసలాట వెనుక కుట్ర ఉందనే విషయాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జూలై 3న హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment