ఐజ్వాల్: ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి అధిపతిగా రికార్డులకెక్కిన జియాన్‌ఘాకా మరణించి 36 గంటలు దాటుతున్నా, ఆయన కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. ఆయన ఇంకా జీవించేఉన్నారని వారు చెబుతున్నారు. 39 మంది భార్యలు, 90 మందికి పైగా సంతానం, 33 మంది మనవళ్లు, మనవరాళ్లున్న 76 ఏళ్ల జియాన్ స్థానిక లాల్పా కోహ్రాన్ ధర్ తెగకు అధిపతి. బీపీ, సుగర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం మరణించినట్లు స్థానిక ట్రినిటీ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు.
అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం ఆయన శరీరం ఇంకా వెచ్చగానే ఉందని, నాడి కొట్టుకుంటూనే ఉందని చెబుతున్నారు. ఆస్పత్రి నుంచి ఇంటికి తెచ్చాక ఆయన నాడి తిరిగి కొట్టుకోవడం ఆరంభించిందని తెగ కార్యదర్శి జతిన్ ఖుమా చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులే కాకుండా స్థానికులు సైతం ఈ పరిస్థితుల్లో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధంగా లేరన్నారు. ఆయన పూర్తిగా మరణించారని తెగ పెద్దలు భావించేవరకు జియాన్‌ను పూడ్చిపెట్టేదిలేదన్నారు. 70 ఏళ్ల క్రితం ఈ తెగను జియాన్ పూర్వీకులు స్థాపించారు. వీరంతా కుటుంబపోషణకు వడ్రంగి పని చేస్తుంటారు. ప్రస్తుతం దాదాపు 433 కుటుంబాలకు చెందిన 2500 మందికి పైగా తెగలో ఉన్నారు.
చదవండి: 38 భార్యల ముద్దుల భర్త ఇక లేరు
Comments
Please login to add a commentAdd a comment