
నిషేధిత ఈ-సిగరెట్లపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ- సిగరెట్ల ప్రచారం, విక్రయాలు జరుపుతున్న వెబ్‌సైట్లపై కొరడా ఘుళిపించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ-సిగరెట్ల అమ్మకాలు, వాటికి సంబంధించిన ప్రకటనలను చేపడుతున్న 15 వెబ్‌సైట్లకు తమ కార్యకలపాలు నిలిపివేయాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరో వైపు ఈ-సిగరెట్లపై నిషేధాన్ని సమర్థంగా పాటించేలా చూడాలని ఆరోగ్య శాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.
సోషల్ మీడియాలో ఈ-సిగరెట్ల ప్రకటనలు, విక్రయాలను కూడా మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, మరో ఆరు వెబ్‌సైట్‌లు కూడా పర్యవేక్షణలో ఉన్నాయని, త్వరలో వాటికి నోటీసులు జారీ చేయవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. "టేక్‌డౌన్ నోటీసులు జారీ చేసిన 15 వెబ్‌సైట్‌లలో నాలుగు కార్యకలాపాలు నిలిపివేయగా.. మిగిలినవి ఇంకా స్పందించలేదని అధికారలు తెలిపారు.
నోటీసులు అందుకున్న వెబ్‌సైట్ యాజమాన్యం ప్రతిస్పందించి, చట్టానికి లోబడి ఉండకపోతే, ఈ వెబ్‌సైట్‌లను తొలగించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తక్షణమే ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని భావిస్తోంది. తదనుగుణంగా ఈ వెబ్‌సైట్‌లపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని యోచిస్తోంది. ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిషేధం (ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వ ప్రకటన) చట్టం 2019లో అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి: సరిహద్దులు దాటిన ‘కృష్ణ’ ప్రేమ.. బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా వచ్చి..
Comments
Please login to add a commentAdd a comment