సాక్షి, న్యూఢిలీ : దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గకపోయినా మరణాల రేటు తగ్గడం, కోలుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగడం ఊరట ఇస్తోంది. ప్రపంచంలోనే అత్యల్పంగా భారత్‌లో కరోనా వైరస్ మరణాల రేటు 1.58 శాతానికి తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో యాక్టివ్ కేసులు 6400 మేర తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో కేవలం 22 శాతమే యాక్టివ్ కేసులున్నాయని, రికవరీ రేటు 75 శాతం దాటిందని ఆయన వెల్లడించారు. కోవిడ్-19 పాజిటివ్ కేసుల్లో కేవలం 2.7శాతం మందే ఆక్సిజన్ సపోర్ట్‌తో ఉన్నారని, 1.29 శాతం మంది రోగులు ఐసీయూలో ఉండగా, 0.29 శాతం మంది వెంటిలేటర్‌పై ఉన్నారని భూషణ్ వెల్లడించారు.
ఇక భారత్‌లో మూడు కోవిడ్-19 వ్యాక్సిన్లు పురోగతిలో ఉన్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ పేర్కొన్నారు. సీరం ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ రెండో దశ(బీ), మూడో దశ పరీక్షల్లో ఉండగా, భారత్ బయోటెక్, జైడస్ కాడిల్లా వ్యాక్సిన్‌లు తొలి దశ పరీక్షలను పూర్తిచేశాయని తెలిపారు. బాద్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ మాస్క్ ధరించని వ‍్యక్తులే భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
యాక్టివ్ కేసుల కంటే మహమ్మారి నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 3.4 రెట్లు అధికంగా ఉందని అన్నారు. ఒక్కరోజులోనే 66,500 మంది కోవిడ్-19 రోగులు కోలుకోవడంతో మొత్తం కోలుకున్న కేసుల సంఖ్య 24.04 లక్షలకు ఎగబాకిందని చెప్పారు. దీంతో రికవరీ రేటు 75.92 శాతానికి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. రికవరీ రేటు 25 రోజుల్లోనే నూరు శాతం పైగా పెరిగిందని వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 31 లక్షలు దాటింది. మరోవైపు అన్‌లాక్ 4.0లో భాగంగా ఈ ఏడాది మార్చి నుంచి నిలిచిపోయిన మెట్రో రైళ్లను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే స్కూళ్లు, కాలేజీలు సహా విద్యా సంస్ధలను ఇప్పట్లో అనుమతించే అవకాశం లేదు. చదవండి : కోవిడ్-19 షాక్ నుంచి ఇప్పట్లో కోలుకోలేం!
Comments
Please login to add a commentAdd a comment