ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. వేడి గాలులు వీస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
రానున్న రోజుల్లో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిక జారీ చేసింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజధాని ఢిల్లీలో సోమవారం ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో 46.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. నజాఫ్‌గఢ్‌లో ఉష్ణోగ్రత 46.3 డిగ్రీలకు చేరుకుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరుసగా రెండవ రోజు కూడా వేడిగాలులు వీస్తున్నాయి.
రానున్న రోజుల్లో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని, పగటిపూట ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గంటకు 25 నుండి 35 కిలోమీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రుతుపవనాలు దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ రుతుపవనాల ప్రభావం ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో తేలికపాటి వర్షం కురిసింది. దీంతో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment