లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పేదల ఉసురు తీశాయి. శుక్రవారం రాజధాని లక్నో, ఉన్నావ్, ఫతేపూర్, సీతాపూర్‌లలో గోడలు, ఇల్లు కూలిన ఘటనల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 9 మంది కూలీలున్నారు. లక్నోలోని దిల్‌కుషా ఏరియాలో ఆర్మీ కేంద్రం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ పనుల్లో పాల్గొంటున్న కూలీలు కొందరు ఆ గోడ పక్కనే గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. భారీ వర్షాలతో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్మాణంలో ఉన్న ప్రహరీ కూలీల గుడిసెలపై కూలిపడింది. శిథిలాల కింద చిక్కుకుని తొమ్మిది మంది చనిపోయారు.
గాయపడిన ఒక్కరిని మాత్రం పోలీసులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. వీరంతా ఝాన్సీ జిల్లాకు చెందిన వారని అధికారులు తెలిపారు. అదేవిధంగా, ఉన్నావ్ జిల్లా కాంతా గ్రామంలోని ఓ ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ఝాలిహాయ్, కసందా గ్రామాల్లో ఇళ్లు కూలి ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఫతేపూర్ జిల్లాలో ముగ్గురు, సీతాపూర్ జిల్లాలో ఒకరు, ప్రయాగ్‌రాజ్‌లో ఇద్దరు చిన్నారులు ఇంటి గోడకూలి మీద పడటంతో ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. లక్నో విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment