సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి గురించి ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఇదేలా సాధ్యమయ్యిందని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులందరితో పాటు ఊరంతా కరోనా సోకినప్పటికి అతడు మాత్రం కోవిడ్ బారిన పడలేదు. దాంతో జనాలతో పాటు వైద్యాధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. వివరాలు.. భూషణ్ ఠాకూర్(52) హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తోరంగ్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం అతడి ఊరిలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. దాని తర్వాత భూషణ్, అతడి కుటుంబ సభ్యులు, గ్రామంలోని ప్రజలంతా కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా కోవిడ్ బారిన పడ్డారు. భూషణ్ కుటుంబంలో అతడితో కలిపి మొత్తం ఆరుగురు ఉంటే.. ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. భూషణ్‌కి పరీక్షలు నిర్వహిస్తే.. నెగిటివ్‌గా వచ్చింది. ప్రస్తుతం ఊరంతా కరోనా బాధితులే.. భూషణ్ తప్ప.
ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘నా టెస్ట్ రిపోర్డు నెగిటివ్ అని తేలింది. నేను పూర్తి సురక్షితంగా.. క్షేమంగా ఉన్నాను. నాకు వ్యాధినిరోధక శక్తి మెండుగా ఉంది. స్వీయ నియంత్రణ, రక్షణ చర్యల వల్ల నేను కోవిడ్ బారిన పడలేదు. వేడుక జరిగన రోజున జనాలంతా గుంపులుగుంపులుగా అందులో పాల్గొన్నారు. సామాజిక దూరం, మాస్క్ ధరించడం వంటివి చేయలేదు. నేను ఈ నియమాలన్నింటిని పాటించాను. నా కుటుంబ సభ్యులకు పాజిటివ్ వచ్చిన తర్వాత వేరుగా ఉండటం ప్రారంభించాను. నా ఆహారాన్ని నేనే వండుకున్నాను. అందుకే మహమ్మారి బారిన పడలేదు’ అన్నారు. ఇక భూషణ్ నివాసం ఉండే తోరంగ్ గ్రామ జనాభా అక్షరాల 43 మంది మాత్రమే. ఈ సందర్భంగా లాహౌల్-స్పితి డిప్యూటీ కమిషనర్ పంకజ్ రాయ్ మాట్లాడుతూ “జిల్లాలో పెరుగుతున్న కేసుల గురించి మేము ఆందోళన చెందుతున్నాము. లాహౌల్ -స్పితి, కులు జిల్లాల్లో దేవతా సంస్కృతి చాలా బలంగా ఉంటుంది. దురదృష్టవశాత్తు మహమ్మారి సమయంలో మతపరమైన కార్యక్రమాలను అనుమతించడం వల్ల తలెత్తే సమస్యల గురించి అధికారులు ఊహించలేకపోయారు. దాంతో కేసులు పెరిగాయి. తోరంగ్ గ్రామంలో అందరికి కరోనా పాజిటివ్ వచ్చింది’’ అన్నారు. (చదవండి: ప్రభుత్వ నిర్ణయంతో వణికిపోతున్న టీచర్లు!)
సాధారణంగా, లాహౌల్-స్పితిలోని చాలా కుటుంబాలు శీతాకాలంలో కులుకు తరలిపోతాయి. ఎందుకంటే అక్కడ భారీ హిమపాతం సంభవిస్తుంది. ఈ ఏడాది కూడా అలానే వెళ్లారు. రెండు సార్లు తిరిగి సొంత ఊళ్లకు వచ్చారు. ఒకటి దేవతా కార్యక్రమం.. రెండు అక్టోబర్ 3న రోహ్తాంగ్ పాస్ ప్రారంభం సందర్భంగా గ్రామానికి తిరిగి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment