హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో నియామకాల జోరు మొదలైంది. మే నెలతో పోలిస్తే జూన్‌లో రిక్రూట్‌మెంట్ 15 శాతం పెరిగిందని నౌకరీ జాబ్ స్పీక్ నివేదిక వెల్లడించింది. నౌకరీ.కామ్‌లో మే నెలలో జాబ్ పోస్టింగ్స్ 2,049 నమోదైతే, జూన్‌లో ఇది 2,350 ఉందని తెలిపింది. ‘ఐటీ-సాఫ్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ రంగాల కారణంగా ఈ స్థాయి వృద్ధి నమోదైంది.
ఏప్రిల్‌లో 15 శాతం తిరోగమనం చెందిన నేపథ్యంలో మార్కెట్ నిలదొక్కుకోవడంతోపాటు రికవరీకి ఇది నిదర్శనం. సవాళ్ల నుంచి బయటపడేందుకు కంపెనీలకు ఐటీ వినియోగానికి డిమాండ్ పెరిగింది. ఐటీ సాఫ్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్ సర్వీసుల రంగం జూన్‌లో 5 శాతం దూసుకెళ్లింది. కోవిడ్-19 ముందస్తు కాలం 2019 జూన్‌తో పోలిస్తే ఈ రంగం అత్యధికంగా గత నెలలో 52 శాతం వృద్ధి సాధించింది. రిటైల్, యాత్రలు, ఆతిథ్య రంగం సైతం మెరుగ్గా పనితీరు కనబరుస్తోంది. హోటల్స్, రెస్టారెంట్స్, ఎయిర్‌లైన్స్, ట్రావెల్ విభాగాలు 87 శాతం, రిటైల్‌లో 57, బీమా 38, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు 29, ఫార్మా, బయోటెక్ 22, ఎఫ్‌ఎంసీజీ 22, విద్యా బోధన 15, బీపీవో, ఐటీఈఎస్‌లో 14 శాతం నియామకాలు అధికమయ్యాయి. రిక్రూట్‌మెంట్ హైదరాబాద్, పుణే 10 శాతం, బెంగళూరు 4 శాతం పెరిగింది. మె నెలలో తిరోగమన బాట పట్టిన ఢిల్లీ/ఎన్‌సీఆర్ 26 శాతం, కోల్‌కత 24 శాతం వృద్ధి నమోదు చేశాయి’ అని నివేదిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment