మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఎమ్మెల్సీ కవిత లేఖతో కదిలిన రాజకీయ పార్టీలు | Huge Response From Political Parties On Kavitha Letter women Quota Bill | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఎమ్మెల్సీ కవిత లేఖతో కదిలిన రాజకీయ పార్టీలు

Published Tue, Sep 5 2023 7:06 PM | Last Updated on Tue, Sep 5 2023 7:52 PM

Huge Response From Political Parties On Kavitha Letter women Quota Bill - Sakshi

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపడుతున్న ముమ్మర ప్రయత్నాలకు అనేక రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి.  పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రాన్ని ఒత్తిడి చేసుకొని బిల్లును ఆమోదింపజేయాలని 47 రాజకీయ పార్టీలకు మంగళవారం రోజున ఆమె రాసిన లేఖ అపూర్వ స్పందన లభించింది. 

 కవిత రాసిన లేఖ  చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల ఆవశ్యతపై దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తించింది.  ఆమె లేఖ రాసిన కొద్ది గంటల్లోనే అనేక పార్టీల నాయకులు స్పందించారు కవిత విజ్ఞప్తిని అంగీకరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్ధతిస్తామని ప్రకటించడమే కాకుండా కవిత చేస్తున్న కృషిని ప్రశంసించారు.  కవిత లేఖపై ఎన్సీపీ, జేడీయూ, సమాజ్ వాదీ పార్టీ, తృణముల్ కాంగ్రెస్, ఆర్జేడీ వంటి కీలక పార్టీలు తక్షణమే స్పందించాయి.  జాతీయ మీడియాలో కవిత లేఖపై తీవ్ర చర్చలు జరిగాయి.

ఎన్సీపీ నేత శరద్ పవార్ స్పందిస్తూ... చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు చాలా అవసరమని, ఎంత మేర రిజర్వేషన్లు కల్పించాలన్న విషయంపై పార్లమెంటులో చర్చ జరగాలని అన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకొస్తే తాము మద్ధతిస్తామని ప్రకటించారు. కానీ బీజేపీకి మహిళా బిల్లుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు.

ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా స్పందిస్తూ... మహిళా రిజర్వేషన్ బిల్లు సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉందని, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల ప్రజాస్వామ్యం మరింత బలంగా మారుతుందని తమ పార్టీ విశ్వసిస్తుందని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా రిజర్వేషన్లు ఉండాలని అన్నారు. లేదంటే మరో 25 ఏళ్ల పాటు వాటి కోసం పోరాడాల్సి వస్తుందని చెప్పారు.రిజర్వేషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును రూపొందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మహిళా బిల్లుకు తమ పార్టీ మద్ధతిస్తుందని చెప్పారు.

సమాజ్ వాది పార్టీ సీనియర్ నాయకురాలు పూజా శుక్లా స్పందిస్తూ...తమ పార్టీ ఎప్పుడూ మహిళా సంక్షేమం కోసం పాటుపడుతుందని, మహిళలకు అవకాశాలు కల్పించడంలో తమ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముందుంటారని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ అనుకూలమని ప్రకటించారు. మహిళా బిల్లు కోసం కల్వకుంట్ల కవిత చేస్తున్న కృషిని అభినందించారు.

తృణముల్ కాంగ్రెస్ నాయకురాలు, పశ్చిమ బెంగాల్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా మాట్లాడుతూ... తమ పార్టీ మహిళా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తోందని, అనేక సందర్భాల్లో తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఆ అంశాన్ని ప్రస్తావించారని వివరించారు. తమ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, సామాజిక, రాజకీయ, ఆర్థిక సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. మహిళా బిల్లు కల్వకుంట్ల కవిత లేఖ రాశారని,  తప్పకుండా మద్ధతిస్తామని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement