
అందమైన ఆఫీసర్‌గా పేరున్న ఐఏఎస్ అధికారిణి టీనా దాబి రెండోసారి వివాహం చేసుకున్నారు. ఐఏఎస్ టీనా దాబీ, ఐఏఎస్ ప్రదీప్ గవాండే వివాహంతో శుక్రవారం ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, బంధువులు సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నారు. టీనా, ప్రదీప్‌ల మ్యారేజ్ మరాఠీ సంప్రదాయం ప్రకారం జరిగింది. వివాహ కార్యక్రమంలో టీనా తెలుపు, బంగారు రంగు చీర ధరించగా, ప్రదీప్ కూడా తెల్లటి కుర్తా-పైజామాలో కనిపించాడు. కొద్దిమంది బంధువుల సమక్షంలో ఈ జంట కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
2015 ఐఏఎస్ బ్యాచ్‌లో టాపర్ అయిన టీనా దాబీ, డాక్టర్ ప్రదీప్ గవాండే (2013 ఐఏఎస్ బ్యాచ్) మే 2021లో మొదటిసారి కలుసుకున్నారు. ఈ జంట ప్రేమ మొదట స్నేహంతో ప్రారంభమైంది. టీనా, ప్రదీప్ కలిసి పనిచేస్తున్నప్పుడు మంచి స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. దాదాపు ఏడాదిపాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. టీనా దాబి తనకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు మార్చిలో సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు కాబోయే భర్త, రాజస్థాన్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాండే అని వెల్లడించింది.
దుమారం రేపిన మొదటి వివాహం.. తర్వాత విడాకులు..
దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించిన టీనా దాబి.. 2015 సివిల్స్ సర్వీసెస్ ఎంట్రెన్స్‌లో టాపర్. అయితే రెండో ర్యాంకర్ అయిన అథర్ అమీర్ ఖాన్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు. ఇక 2018లో వీళ్లిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట 2020లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు కూడా తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment