చండీగఢ్: తాగి బండి నడుపొద్దని పోలీసులు ఎంత చెప్పినా వినటం లేదు మందు బాబులు. వేలకు వేలు ఫైన్లు రాసినా దారికి రావటం లేదు. ఈ క్రమంలో ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు పంజాబ్ పోలీసులు. కొత్త ట్రాఫిక్ నియమాలకు శుక్రవారం ఆమోద ముద్ర వేసింది అక్కడి ప్రభుత్వం. ఈ కొత్త నిబంధనల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందు కొట్టి పట్టుబడితే.. రక్త దానం చేయాలి. లేదంటే సమీపంలోని ఆసుపత్రిలో కొన్ని గంటల పాటు రోగులకు సేవ చేయాలి.
కొత్త నిబంధనలు ఇలా..
- మందు కొట్టి దొరికిపోయిన వారు తప్పనిసరిగా రక్త దానం చేయాలి.
- లేదంటే సమీపంలోని ఆసుపత్రిలో కొన్ని గంటలు సేవ చేయాలి.
- రెండు గంటల పాటు చిన్నారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి.
- రవాణా శాఖ నుంచి రీఫ్రెస్ కోర్స్ ధ్రువపత్రం పొందాల్సి ఉంటుంది.
మరోవైపు.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి లైసెన్స్‌ను మూడు నెలల పాటు రద్దు చేయనున్నారు. అందులో ఓవర్ స్పీడ్, వాహనం నడుపుతూ మొబైల్ వాడటం, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్‌లు వంటివి ఉన్నాయి. ఒక వేల రెండోసారి దొరికితే రెండింతల ఫైన్ వేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిసినా.. మొబైల్ వాడినా రూ.5వేల జరిమానా విధిస్తారు. రెండోసారి అది డబుల్ అవుతుంది.
అలాగే.. ఓవర్ లోడు వాహనాలకు రూ.20వేల జరిమానా విధించనున్నారు. రెండోసారి అలాగే చేస్తే జరిమానా రెండింతలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్‌కు మొదటిసారి రూ.వెయ్యి, రెండోసారి డబుల్ ఉంటుందన్నారు. పంజాబ్‌లో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతిరోజు 13 మంది మరణిస‍్తున్నారు. 2011 నుంచి 2020 వరకు 56,959 ప్రమాదాలు జరిగాయి. 46,550 మంది మరణించారు.
ఇదీ చూడండి: ఆర్‌ఎల్‌పీ ఎమ్మెల్యే కారు చోరీ.. పోలీసుల తీరుపై ఆరోపణ!
Comments
Please login to add a commentAdd a comment