పండుగ బోనస్‌లు, సరిగ్గా జీతాలు పడే టైంలో.. ఫెస్టివల్ ఆఫర్లు-ధమాకా సేల్స్‌తో ముందుకొచ్చాయి ఈ-కామర్స్ సంస్థలు. ఇప్పటికే చాలామంది ఆన్‌లైన్ కొనుగోళ్లతో బిజీగా గడిపేస్తున్నారు. అదే సమయంలో ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించి కొన్ని చేదు అనుభవాలు ఇంటర్నెట్ ద్వారా యూజర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి కూడా.
ఆన్‌లైన్ షాపింగ్ చేసే సమయంలో తొందరపాటు అస్సలు పనికి రాదు. కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. లేకుంటే.. మోసపోవడంతో పాటు కాలం వృధాకావడం, అనవసరమైన నష్టపోవడం వాటిల్లుతుంది కూడా.
ఆన్‌లైన్ షాపింగ్‌లో లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా జరుగుతుంటాయి. ఒక్కోసారి అవి యూజర్లకు తెలియకుండానే జరిగిపోతుంటాయ్ కూడా.
నమ్మదగిన సైట్ల నుంచే..
రోజుకో కొత్త ఆన్‌లైన్ షాపింగ్ సైట్ పుట్టుకొస్తోంది. డెడ్ చీపుగా ప్రొడక్టులు అందిస్తామని ప్రచారాలు చేసుకుంటున్నాయవి. అయితే.. అలాంటి వాటి గురించి క్షుణ్ణంగా ఆరా తీశాకే ప్రొడక్టులు కొనుగోలు చేయాలి. రివ్యూలతో సైతం బోల్తా కొట్టిస్తున్న ఈరోజుల్లో.. ప్రొడక్టు నాణ్యత గురించి అవగాహనకు రావడం కొంచెం కష్టమే. అయినా కూడా నష్టపోకూడదంటే నమ్మకం ఉన్న.. ఉత్తమ సర్వీసులు అందిస్తున్న సైట్ల నుంచే వస్తువులను కొనుగోలు చేసుకోవడం ఉత్తమం.
► యాప్‌లలో కాకుండా వెబ్ సైట్ల నుంచి గనుక ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే.. పైన బ్రౌజర్ యూఆర్‌ఎల్‌లో సైట్లకు ముందు https లేదంటే http ఉందో లేదో గమనించాలి. అలా ఉంటే.. ఆ సైట్ ఎన్‌క్రిప్టెడ్ అన్నమాట. అంటే షాపింగ్ చేసుకునేందుకు అనుగుణంగా ఉంటుందని, తద్వారా మీ డివైజ్‌లోని డేటా సురక్షితంగా ఉంటుందని అర్థం.
► పెద్ద పెద్ద ఈ-కామర్స్ యాప్‌లు, వెబ్‌సైట్లలోనూ ఆర్థిక సంబంధిత విషయాల్లో బోల్తా పడుతుంటారు చాలామంది. అధిక ఛార్జీలు వసూలు చేయడం.. కొన్ని సందర్భాల్లో మాత్రమే క్యాష్ బ్యాక్ కూపన్లు ఉపయోగించే వెసులుబాటు కల్పిస్తుండడంతో.. కూపన్లను వాడుకోవడానికి చాలాకాలం ఎదురు చూడాల్సి వస్తుంది. లేదంటే ఒక్కోసారి అవి ఎక్స్‌పెయిర్ అయిపోతుంటాయి కూడా.
కాబట్టి, క్యాష్ బ్యాక్‌లు ఎంత వరకు లబ్ధి చేకూరుతాయనేది బేరీజు వేసుకున్నాకే ముందుకు వెళ్లాలి. ఒకటి కంటే ఎక్కువ యాప్‌లు/వెబ్‌సైట్‌లు పరిశీలించాకే ఉత్పత్తులను కొనుగోలు చేసుకోడం ఇంకా మంచిది. తద్వారా సరైన ఆఫర్లను గుర్తించడంతోపాటు ఎక్స్‌ట్రా ఛార్జీలు, డెలివరీ ఛార్జీల తలనొప్పి నుంచి తప్పించుకోవచ్చు.
► డెబిట్‌కార్డులు ఉపయోగించకపోవడం మంచిది. ఎందుకంటే.. బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయ్యి ఉండడం వల్ల ఫైనాన్షియల్ వివరాలను, వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకింగ్ గురయ్యే అవకాశాలు ఉండొచ్చు. అందుకే క్రెడిట్ కార్డులను వీలైనంత వరకు షాపింగ్ కోసం ఉపయోగించాలి. లేదంటే.. మాస్టర్‌కార్డ్ సెక్యూరిటీ కోడ్ లేదంటే వెరిఫైడ్ బై వీసాలను ఉపయోగించడం వల్ల సురక్షితంగా షాపింగ్ చేసుకోవచ్చు.
► షాపింగ్ సీజన్‌లో రకరకాల యాప్‌లను, వెబ్‌సైట్లను మోసగాళ్లు టార్గెట్ చేస్తుంటారు. ఈ క్రమంలో భారీగా డిస్కౌంట్‌లంటూ లింకులను పంపడం ద్వారా యూజర్లను ఆకర్షించి.. డేటా చోరీకి పాల్పడుతుంటారు. అలాంటి సమయంలో తొందరపాటులో వాటిని క్లిక్ చేయకూడదు. సంబంధిత సైట్, యాప్‌లో ఆ ఆఫర్లు నిజంగా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోవాలి.
► తాజాగా.. ఓ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ నుంచి ల్యాప్‌ట్యాప్ ఆర్డర్ పెట్టిన ఓ వ్యక్తికి బట్టల సబ్బుల పార్శిల్ షాకిచ్చింది. తీరా కంపెనీని బాధిత వ్యక్తి సంప్రదించగా.. తమ పరిధిలో అంశం కాదంటూ సమాధానం ఇచ్చింది. డ్రోన్ కెమెరా ఆర్డర్ పెట్టిన వ్యక్తికి బంగాళ దుంపలు పార్శిల్ వచ్చింది మరో వెబ్‌సైట్‌లో.
ఇలాంటి సందర్భాల్లో.. ఓపెన్ బాక్స్ డెలివరీ కాన్సెప్ట్ ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. దేశంలో చాలామందికి తెలియని కాన్సెప్ట్ ఇది. కొన్ని ప్రొడక్టుల విషయంలో(ధర అధికంగా ఉన్నవాటి విషయంలో ప్రత్యేకించి జరుగుతుంటుంది) డెలివరీ బాయ్‌కు ఓటీపీ చెప్పాల్సి వస్తుంది. అలాంటప్పుడు ముందుగా బాక్స్‌ను డెలివరీ బాయ్‌ల సమక్షంలో తెరిచి.. అంతా పరిశీలించుకున్నాకే.. ఓటీపీ చెప్పడం కరెక్ట్. ఒకవేళ తొందరపాటులోనో, అవగాహన లేకనో, ఇతర కారణాల వల్లనో ప్రొడక్టును చూసుకోకుండా ఓటీపీ చెప్పేస్తే గనుక.. ఆ తర్వాత పరిణామాలకు సదరు కంపెనీలకు ఎలాంటి సంబంధం ఉండదు. కావాలంటే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి.. న్యాయం కోసం పోరాడవచ్చు.
► ఇంతేకాదు.. ఆన్‌లైన్‌లో ఎలాంటి ప్రొడక్టును అయినా డెలివరీ బాయ్ నుంచి తీసుకున్నాక.. వీలైతే వాళ్ల సమక్షంలోనే వాటిని తెరిచి చూడడం మంచిది. ఒకవేళ డ్యామేజ్ ఉన్నా, ఇతర సమస్యలున్నా అప్పటికప్పుడే వెనక్కి పంపించాలి. కుదరదని గనుక సమాధానం వస్తే.. పరిహారం దిశగా ప్రయత్నాలు చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో.. ఫొటోలు, వీడియోలు తీయడం ద్వారా ఆధారాలను సేకరించి పెట్టుకోవడం అత్యుత్తమమైన పని.
అన్నింటికి మించి.. అవసరం లేకున్నా ఆఫర్లలలో వస్తున్నాయి కదా అని ప్రొడక్టులు కొనడం తగ్గించుకుంటే.. డబ్బును, సమయాన్ని ఆదా చేసుకున్న వాళ్లు అవుతారు.
Comments
Please login to add a commentAdd a comment