Online Shopping Festival
-
పండుగ ఆఫర్లు.. ఆన్లైన్లో ఆర్డర్లు పెడుతున్నారా?
పండుగ బోనస్‌లు, సరిగ్గా జీతాలు పడే టైంలో.. ఫెస్టివల్ ఆఫర్లు-ధమాకా సేల్స్‌తో ముందుకొచ్చాయి ఈ-కామర్స్ సంస్థలు. ఇప్పటికే చాలామంది ఆన్లైన్ కొనుగోళ్లతో బిజీగా గడిపేస్తున్నారు. అదే సమయంలో ఆన్లైన్ షాపింగ్‌కు సంబంధించి కొన్ని చేదు అనుభవాలు ఇంటర్నెట్ ద్వారా యూజర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి కూడా. ఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో తొందరపాటు అస్సలు పనికి రాదు. కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. లేకుంటే.. మోసపోవడంతో పాటు కాలం వృధాకావడం, అనవసరమైన నష్టపోవడం వాటిల్లుతుంది కూడా. ఆన్లైన్ షాపింగ్‌లో లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా జరుగుతుంటాయి. ఒక్కోసారి అవి యూజర్లకు తెలియకుండానే జరిగిపోతుంటాయ్ కూడా. నమ్మదగిన సైట్ల నుంచే.. రోజుకో కొత్త ఆన్లైన్ షాపింగ్ సైట్ పుట్టుకొస్తోంది. డెడ్ చీపుగా ప్రొడక్టులు అందిస్తామని ప్రచారాలు చేసుకుంటున్నాయవి. అయితే.. అలాంటి వాటి గురించి క్షుణ్ణంగా ఆరా తీశాకే ప్రొడక్టులు కొనుగోలు చేయాలి. రివ్యూలతో సైతం బోల్తా కొట్టిస్తున్న ఈరోజుల్లో.. ప్రొడక్టు నాణ్యత గురించి అవగాహనకు రావడం కొంచెం కష్టమే. అయినా కూడా నష్టపోకూడదంటే నమ్మకం ఉన్న.. ఉత్తమ సర్వీసులు అందిస్తున్న సైట్ల నుంచే వస్తువులను కొనుగోలు చేసుకోవడం ఉత్తమం. ► యాప్‌లలో కాకుండా వెబ్ సైట్ల నుంచి గనుక ఆన్లైన్ షాపింగ్ చేస్తే.. పైన బ్రౌజర్ యూఆర్ఎల్లో సైట్లకు ముందు https లేదంటే http ఉందో లేదో గమనించాలి. అలా ఉంటే.. ఆ సైట్ ఎన్క్రిప్టెడ్ అన్నమాట. అంటే షాపింగ్ చేసుకునేందుకు అనుగుణంగా ఉంటుందని, తద్వారా మీ డివైజ్‌లోని డేటా సురక్షితంగా ఉంటుందని అర్థం. ► పెద్ద పెద్ద ఈ-కామర్స్ యాప్‌లు, వెబ్సైట్లలోనూ ఆర్థిక సంబంధిత విషయాల్లో బోల్తా పడుతుంటారు చాలామంది. అధిక ఛార్జీలు వసూలు చేయడం.. కొన్ని సందర్భాల్లో మాత్రమే క్యాష్ బ్యాక్ కూపన్లు ఉపయోగించే వెసులుబాటు కల్పిస్తుండడంతో.. కూపన్లను వాడుకోవడానికి చాలాకాలం ఎదురు చూడాల్సి వస్తుంది. లేదంటే ఒక్కోసారి అవి ఎక్స్పెయిర్ అయిపోతుంటాయి కూడా. కాబట్టి, క్యాష్ బ్యాక్‌లు ఎంత వరకు లబ్ధి చేకూరుతాయనేది బేరీజు వేసుకున్నాకే ముందుకు వెళ్లాలి. ఒకటి కంటే ఎక్కువ యాప్‌లు/వెబ్సైట్లు పరిశీలించాకే ఉత్పత్తులను కొనుగోలు చేసుకోడం ఇంకా మంచిది. తద్వారా సరైన ఆఫర్లను గుర్తించడంతోపాటు ఎక్స్ట్రా ఛార్జీలు, డెలివరీ ఛార్జీల తలనొప్పి నుంచి తప్పించుకోవచ్చు. ► డెబిట్‌కార్డులు ఉపయోగించకపోవడం మంచిది. ఎందుకంటే.. బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయ్యి ఉండడం వల్ల ఫైనాన్షియల్ వివరాలను, వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకింగ్ గురయ్యే అవకాశాలు ఉండొచ్చు. అందుకే క్రెడిట్ కార్డులను వీలైనంత వరకు షాపింగ్ కోసం ఉపయోగించాలి. లేదంటే.. మాస్టర్‌కార్డ్ సెక్యూరిటీ కోడ్ లేదంటే వెరిఫైడ్ బై వీసాలను ఉపయోగించడం వల్ల సురక్షితంగా షాపింగ్ చేసుకోవచ్చు. ► షాపింగ్ సీజన్లో రకరకాల యాప్‌లను, వెబ్సైట్లను మోసగాళ్లు టార్గెట్ చేస్తుంటారు. ఈ క్రమంలో భారీగా డిస్కౌంట్లంటూ లింకులను పంపడం ద్వారా యూజర్లను ఆకర్షించి.. డేటా చోరీకి పాల్పడుతుంటారు. అలాంటి సమయంలో తొందరపాటులో వాటిని క్లిక్ చేయకూడదు. సంబంధిత సైట్, యాప్‌లో ఆ ఆఫర్లు నిజంగా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోవాలి. ► తాజాగా.. ఓ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ నుంచి ల్యాప్‌ట్యాప్ ఆర్డర్ పెట్టిన ఓ వ్యక్తికి బట్టల సబ్బుల పార్శిల్ షాకిచ్చింది. తీరా కంపెనీని బాధిత వ్యక్తి సంప్రదించగా.. తమ పరిధిలో అంశం కాదంటూ సమాధానం ఇచ్చింది. డ్రోన్ కెమెరా ఆర్డర్ పెట్టిన వ్యక్తికి బంగాళ దుంపలు పార్శిల్ వచ్చింది మరో వెబ్సైట్లో. ఇలాంటి సందర్భాల్లో.. ఓపెన్ బాక్స్ డెలివరీ కాన్సెప్ట్ ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. దేశంలో చాలామందికి తెలియని కాన్సెప్ట్ ఇది. కొన్ని ప్రొడక్టుల విషయంలో(ధర అధికంగా ఉన్నవాటి విషయంలో ప్రత్యేకించి జరుగుతుంటుంది) డెలివరీ బాయ్‌కు ఓటీపీ చెప్పాల్సి వస్తుంది. అలాంటప్పుడు ముందుగా బాక్స్‌ను డెలివరీ బాయ్‌ల సమక్షంలో తెరిచి.. అంతా పరిశీలించుకున్నాకే.. ఓటీపీ చెప్పడం కరెక్ట్. ఒకవేళ తొందరపాటులోనో, అవగాహన లేకనో, ఇతర కారణాల వల్లనో ప్రొడక్టును చూసుకోకుండా ఓటీపీ చెప్పేస్తే గనుక.. ఆ తర్వాత పరిణామాలకు సదరు కంపెనీలకు ఎలాంటి సంబంధం ఉండదు. కావాలంటే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి.. న్యాయం కోసం పోరాడవచ్చు. ► ఇంతేకాదు.. ఆన్లైన్లో ఎలాంటి ప్రొడక్టును అయినా డెలివరీ బాయ్ నుంచి తీసుకున్నాక.. వీలైతే వాళ్ల సమక్షంలోనే వాటిని తెరిచి చూడడం మంచిది. ఒకవేళ డ్యామేజ్ ఉన్నా, ఇతర సమస్యలున్నా అప్పటికప్పుడే వెనక్కి పంపించాలి. కుదరదని గనుక సమాధానం వస్తే.. పరిహారం దిశగా ప్రయత్నాలు చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో.. ఫొటోలు, వీడియోలు తీయడం ద్వారా ఆధారాలను సేకరించి పెట్టుకోవడం అత్యుత్తమమైన పని. అన్నింటికి మించి.. అవసరం లేకున్నా ఆఫర్లలలో వస్తున్నాయి కదా అని ప్రొడక్టులు కొనడం తగ్గించుకుంటే.. డబ్బును, సమయాన్ని ఆదా చేసుకున్న వాళ్లు అవుతారు. -
ఆహా..ఆన్లైన్ షాపింగ్.. అన్నీ అక్కడే!
సాక్షి, హైదరాబాద్: దసరా..దీపావళి పండుగల వేళ సిటీజనులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుపుతున్నారు. రొటీన్‌కు భిన్నంగా వీరు కొత్త దుస్తులు, వాహనాలు, ఇతర గృహోపకరణాలు, పిండి వంటలు, డైలీ నీడ్స్ తదితరాలను ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. జనం ఆసక్తికి అనుగుణంగానే పలు ఆన్లైన్ కంపెనీలు వాటి వ్యాపార ధృక్పథాన్ని మార్చుకున్నాయి. భారీ ఆఫర్లు, ట్రెండీ ఉత్పత్తులు, సత్వర డెలివరీ వంటి అంశాలతో ఆకట్టుకుంటున్నాయి. చదవండి: ‘పండగ పూటా పస్తులేనా?.. మేమేం పాపం చేశాం’ ♦ పలు ఈ–కామర్స్ సంస్థలు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన గంట నుంచి మూడు గంటల్లోనే వస్తువులను వినియోగదారుల చెంతకు చేరుస్తున్నాయి. ♦ దీంతో మార్కెట్‌కు వెళ్లి షాపింగ్ చేయడం కంటే..ఇంట్లో కూర్చుని ఒక్క క్లిక్‌తో అనుకున్నది పొందొచ్చనే ధోరణి ఇటీవల బాగా పెరిగింది. ♦ గ్రేటర్లో కరోనా ప్రభావం తగ్గినా కూడా పండుగ పూట జనం బయటికి వెళ్లడం లేదు. ఉన్నచోటనే ఉంటూ తమకు నచ్చిన దుస్తులు, ఫుట్‌వేర్, హోం అప్లయన్సెస్, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్‌ను ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. చదవండి: Huzurabad Bypoll: హుజూరాబాద్‌కు అమిత్ షా? ♦ షాపింగ్ మాల్స్‌కు ధీటుగా ఆన్‌లైన్‌లోనూ డిస్కౌంట్లు, ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ♦ వాస్తవంగా కరోనా లాక్డౌన్ టైమ్‌లో ఆన్లైన్ సేల్స్‌కు మంచి ఆదరణ లభించింది. అదే పంథా ఇప్పటికీ కొనసాగుతోంది. ♦ గతంలో మాదిరిగా చాలా మంది కుటుంబ సమేతంగా వెళ్లి షాపింగ్ చేయడం తగ్గించారు. ♦ ఇంటి వద్దకే అన్ని వస్తువుల డోర్ డెలివరీకి అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఆన్‌లైన్‌కే వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ– కామర్స్ సైట్లతో ఒప్పందాలు ♦ ఆన్లైన్ బిజినెస్ బాగా పెరగడంతో పలు షోరూంలు, మాల్స్, షాపుల నిర్వాహకులు సైతం వారి పంథాను మార్చుకున్నారు. ఈ–కామర్స్ సంస్థలతో సంప్రదింపులు జరిపి వారితో ‘టై–అప్’ అవుతున్నారు. ఆన్లైన్ వేదికలుగా వారి ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ♦ ఎమ్మార్పీ కంటే 15 నుంచి 50 శాతం వరకు ఆఫర్‌తో సేల్ చేసేలా అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఏటా నిర్వహించే ఫెస్టివల్ క్లియరెన్స్ సేల్స్ తరహాలోనే ఉన్న స్టాక్‌ను ఆన్లైన్లో అమ్మేలా వ్యాపారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ♦ చిన్న, పెద్ద వ్యాపారులను డిజిటల్ మార్కెట్లోకి తీసుకొచ్చేలా ఈ–కామర్స్ సంస్థలు కూడా అఫిలియేటివ్, సెల్లర్ బిజినెస్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. రూ.100 కోట్లకు పైనే.. ఈ సీజన్లో గ్రేటర్ వ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు ఆన్లైన్లో వ్యాపారం జరిగినట్లు వివిధ ఈ కామర్స్ సంస్థల ద్వారా తెలుస్తోంది. పండుగల నేపథ్యంలో భారీ తగ్గింపులు, ఆఫర్ల వల్ల వినియోగదారులు బాగా ఆకర్షితులయ్యారని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ఎక్కువగా మొబైల్ ఫోన్లు, దుస్తులు, పాదరక్షలు, ఎల్రక్టానిక్ గూడ్స్‌ను వినియోగదారులు కొనుగోలు చేశారని తెలుస్తోంది. వీటి తర్వాత గ్రోసరీస్‌ను కూడా పెద్ద ఎత్తున ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లు వెల్లడవుతోంది. రోజుకు 20 నుంచి 25 వస్తువుల డెలివరీ దసరా పండుగ సీజన్లో కొనుగోళ్లు బాగా పెరిగాయి. నేను రోజుకు 20 నుంచి 25 ఐటమ్స్ వినియోగదారులకు డెలివరీ చేస్తున్నా. గతంలో కేవలం ఐదు నుంచి ఎనిమిది మాత్రమే ఉండేవి. – రాకేష్, ఆన్లైన్ సంస్థ డెలివరీ బాయ్, బర్కత్‌పుర -
SBI: క్రెడిట్‌కార్డు వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ ఆఫర్
భారతీయ స్టేట్ బ్యాంక్(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన కార్డు వినియోగదారుల కోసం దమ్దార్ దస్ పేరుతో పండుగ ఆఫర్ ప్రకటించింది. క్రెడిట్ కార్డ్స్ వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోళ్లపై 10 శాతం క్యాష్ బ్యాక్ అందుకోవచ్చని తెలిపింది. అంతేకాదు ఈఎంఐ కొనుగోళ్లకూ ఇది వర్తిస్తుందని పేర్కొంది. దసరా, దీపావళి పండుగ సీజన్ వచ్చేసింది. ఈ మూడ్‌కి తగ్గట్లే ఆన్లైన్లో షాపింగ్ జోరందుకుంటుంది. కార్డుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. పండుగ సీజన్ కాబట్టే ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలిపింది ఎస్బీఐ. అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 3 నుంచి కేవలం మూడు రోజులపాటు వర్తించనుంది. ఆన్లైన్లో మొబైల్స్, అప్లియెన్సెస్, హోం డెకర్.. తదితర కొనుగోళ్లకు దమ్దార్ దస్ ఆఫర్ వర్తిస్తుంది. అయితే బీమా, యాత్రలు, వాలెట్, ఆభరణాలు, విద్య, ఆరోగ్యం, పౌర సేవలకు ఇది వర్తించదు అని కంపెనీ తెలిపింది. పూర్తి వివరాల కోసం దమ్దార్ దస్ లింక్‌ను క్లిక్ చేయండి. -
చేసేయ్... ఆన్లైన్ షాపింగ్
ఏజెన్సీలోని యువత ఇటీవల కాలంలో ఆన్లైన్ షాపింగ్‌పై మక్కువ చూపుతున్నారు. మారుతున్న సమాజంలో మార్పులకు అనుగుణంగా వారు కూడా అలవాటు పడుతున్నారు. ఏ వస్తువు కావాలన్నా ఇంటికే నేరుగా వచ్చే సదుపాయం ఆన్లైన్ షాపింగ్‌లో ఉండడంతో గిరిజన యువత ఆసక్తి చూపుతున్నారు. కోరుకున్న వస్తువు కోరుకున్న చోటుకు ఇట్టే వచ్చేస్తుండడంతో పాటు వచ్చిన తరువాత కూడా ఇష్టం లేకుంటే తిరిగి పంపే సదుపాయం ఉండడం, ఆ మొత్తం తిరిగి తమ అకౌంటులో పడుతుండడంతో హ్యాపీగా ఆన్లైన్ షాపింగ్ చేసేస్తున్నారు. సాక్షి, గుమ్మలక్ష్మీపురం(విజయనగరం) : ఏవైనా వస్తువులు, దుస్తులు కొనుగోలు చేయాలంటే అందుబాటులో ఉన్న దుకాణాలకు తిరిగి, బేరమాడి కొనుగోలు చేసే రోజులు క్రమంగా మారిపోతున్నాయి. కాలానుగుణంగా మార్పులు రావడంతో పాటు ఇంటర్నెట్, క్యాష్ ఆన్ డెలివరీ తదితర సదుపాయాలు అందుబాటులోకి రావడంతో పరిస్థితి మారింది. ఎక్కువ శాతం మంది ముఖ్యంగా యువత ఆన్లైన్ మార్కెట్‌పై తెగ మోజు చూపిస్తున్నారు. వస్తువైనా, ఆహారమైనా, దుస్తులైనా అన్నింటికీ ఆన్లైన్ షాపింగ్స్‌పై ఆధారపడుతున్నారు. ధరలు అందుబాటులో ఉండడం, సమయం ఆదా అవుతుండటంతో ఆన్లైన్ సేవలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ పట్ల యువతకు విపరీతమైన క్రేజ్ ఏర్పడిందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. గతంలో గంటల తరబడి దుకాణాల్లో వేచి ఉండి కావాల్సినవి కొనుగోలు చేసే వారు. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంట్లో కూర్చొని తమకు నచ్చిన వస్తువులను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. చిన్నపాటి వస్తువు నుంచి ద్విచక్ర వాహనాలు (సైకిళ్లు), ఎల్ఈడీ టీవీలు, మొబైల్ ఫోన్లు, ఈయర్ ఫోన్లు, ఫోన్ పౌచ్‌లు, కూలింగ్ కళ్లజోళ్లు, షూలు, వంట పాత్రలు ఇలా ఏది కావాలన్నా...ఆన్లైన్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. నచ్చితే ఓకే.. లేదంటే వాపస్ ప్రస్తుతం అంతా ఆన్లైన్ వైపు చూస్తున్నారు. విభిన్న ఫీచర్లతో మార్కెట్‌ను మంచెత్తుతున్న స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండటంతో ఆన్లైన్ మార్కెటింగ్ క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతోంది. నచ్చిన వస్తువులు ఎంపిక చేసుకోవడమే తరువాయి. ఇంటి ముంగిటకు కోరినవి వచ్చి చేరుతున్నాయి. వినియోగదారులకు ఎంతో విలువైన సమయం ఆదా అవుతోంది. వస్తువు నచ్చకపోతే వాపస్ చేసి నగదును తమ అకౌంట్లోకి తిరిగి పోందుతున్నారు. అదే దుకాణాల్లో కొనుగోలు చేస్తే వస్తువు నచ్చకపోతే మరో వస్తువు తీసుకోవాల్సిందే. నగదు మాత్రం తిరిగి ఇచ్చే అవకాశం లేదు. దీంతో ఆన్లైన్ షాపింగ్‌పై ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఆన్లైన్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, జోమాటో తదితరవి ఆన్లైన్లో సేవలు అందిస్తున్నాయి. వీటికి ప్రజల నుంచి ఆదరణ పొందుతున్నాయి. మనకు కావాల్సిన వస్తువులు ఆన్లైన్లో నమోదు చేయగానే వందల కొద్ది మోడల్స్, వాటి రంగులు, ధరలు, ఫొటోలతో సహా నమూనాలు చూపిస్తున్నాయి. దీంతో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మంచి వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు వీలుంది. ఆన్లైన్ సేవలు ఏజెన్సీ ప్రాంతానికి కూడా విస్తరించాయంటే వాటికి ఆదరణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈజీ మార్కెటింగ్ ఆన్లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ మేక్ ఇట్ ఈజీగా మారిపోయింది. పనులపై బిజిబిజీగా గడుపుతున్నారు. ఈ తరుణంలో ఆన్లైన్ షాపింగ్‌తో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కోరుకున్న వస్తువు ఇంటికి చేరుతోంది. కొత్త కొత్త వెరైటీలు లభిస్తుండటంతో అందరూ అటువైపు వెళ్తున్నారు. – నిమ్మక సుశాంత్, తాడికొండ క్యాష్ ఆన్ డెలివరీ విధానం మేలు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన వేల రూపాయల విలువ చేసే వస్తువులకు బదులుగా కొన్ని సందర్భాల్లో ప్యాకింగ్ లోపల అట్టలు, కాగితాలు ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆన్లైన్లో ఎక్కువ మొత్తంలో షాపింగ్ చేసే వ్యక్తులు సాధ్యమైనంత వరకు క్యాష్ ఆన్ డెలివరీ విధానం ద్వారానే షాపింగ్ చేసుకోవడమే మంచిది. దీని వల్ల ఆన్లైన్ మోసాలు సాధ్యమైనంత వరకు జరగకుండా ఉంటాయి –కె.వెంకటరావు, ఎస్ఐ, ఎల్విన్‌పేట -
గూగుల్ గ్రేట్ షాపింగ్ ఫెస్టివల్
న్యూఢిల్లీ: గూగుల్ ఇండియా నిర్వహించే గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్(జీఓఎస్ఎఫ్) వచ్చే నెల 10-12 తేదీల్లో జరగనున్నది. ఈ ఆన్లైన్ షాపింగ్ పెస్టివల్కు ప్రాధాన్యత భాగస్వామిగా ఆదిత్య బిర్లా మనీ మైయూనివర్శ్ వ్యవహరిస్తుంది. విదేశాల్లో సైబర్ మండే పేరుతో ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్ జరుగుతుందని, దీనికి భారత వెర్షన్‌గా జీఓఎస్ఎఫ్ను నిర్వహిస్తున్నామని గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ రాజన్ ఆనందన్ పేర్కొన్నారు. ఈ 72 గంటల షాపింగ్ ఫెస్టివల్లో 450కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని, భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయని వివరించింది. రూ.299 స్పెషల్ సెక్షన్‌ను అందిస్తున్నామని, దీంట్లో భారీ డిస్కౌంట్లకు వస్తువులను అందిస్తామని, రవాణా చార్జీలు ఉచితమని, వస్తువు అందిన తర్వాతనే నగదు చెల్లించే ఫీచర్ ఉందని వివరించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 8 వరకూ ప్రత్యేకమైన పోటీని నిర్వహిస్తున్నామని, ఈ పోటీలో గెలుపొందిన వారు 14 నిమిషాల పాటు ఉచితంగా (రూ.2.5 లక్షల విలువైనవి) షాపింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
గూగుల్ షాపింగ్ ఫెస్టివల్లో టాటా ఫ్లాట్లు
న్యూఢిల్లీ: టాటా హౌసింగ్ ఫ్లాట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. నేటి(బుధవారం) నుంచి మూడు రోజుల పాటు ఇంటర్నెట్ సెర్చింజన్, గూగుల్ ఆధ్వర్యంలో జరిగే గ్రేట్ ఆన్లై న్ షాపింగ్ ఫెస్టివల్లో భాగంగా తమ ఫ్లాట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని టాటా గ్రూప్‌కు చెందిన టాటా హౌసింగ్ తెలిపింది. ఈ మేరకు గూగుల్‌తో తమ అనుబంధ సంస్థ టాటా వాల్యూ హోమ్స్(టీవీహెచ్‌ఎల్)ఒక ఒప్పందం కుదుర్చుకుందని టాటా హౌసింగ్ తెలిపింది. పుణే, బెంగళూరు, అహ్మదాబాద్‌ల్లోని టీవీహెచ్‌ఎల్ ప్రాజెక్టుల్లోని గృహాలను రూ.20,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని వివరించింది. 45 రోజుల్లో 30% సొమ్మును, మిగిలిన 70 శాతం మొత్తాన్ని అపార్ట్మెంట్ అప్పగించేటప్పుడు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.