
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన సాంట్ (స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్) మిస్సైల్‌ను భారత్ శనివారం విజయవంతంగా పరీక్షించింది. హెలికాప్టర్ నుంచి లాంచ్ చేయగలగడం ఈ మిస్సైల్ ప్రత్యేకత. రాజస్తాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో దీన్ని పరీక్షించారు. ఈ ఫ్లైట్ టెస్టింగ్‌ను డీఆర్‌డీఓ, భారతీయ వాయు దళం సంయుక్తంగా నిర్వహించాయని రక్షణ శాఖ వెల్లడించింది. మిసైల్ అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిందని తెలిపింది.
పది కిలోమీటర్ల రేంజ్‌లో లక్ష్యాలను ఈ మిస్సైల్ ఛేదించగలదు. మిస్సైల్ రిలీజ్ మెకానిజం, గైడెన్స్, ట్రాకింగ్, అంతర్గత సాఫ్ట్‌వేర్ అన్నీ బాగా పనిచేశాయని రక్షణ శాఖ ప్రకటన తెలిపింది. ప్రాజెక్టు విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పరిశోధక బృందాన్ని అభినందించారు. హైదరాబాద్‌లోని ఆర్‌సీఐ (ఇమారత్)లో దీన్ని డిజైన్ చేయడం జరిగింది.
ఇటీవల కాలంలో పరీక్షించిన దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాల్లో ఇది మూడోదని రక్షణ శాఖ తెలిపింది. దేశీయ రక్షణ సామర్థ్యాలకు మరింత జోరునిచ్చేందుకు సాంట్ పరీక్ష విజయవంతం కావడం దోహదం చేస్తుందని డీఆర్‌డీఓ చైర్మన్ సతీశ్ రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment