న్యూఢిల్లీ: దేశంలో నాలుగు నెలల వర్షాకాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) బుధవారం ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది మంచి వర్షాలు కురిశాయని తెలియజేసింది. ఈ ఏడాది కురిసిన వర్షం గత 30 ఏళ్లలో మూడో అతిపెద్ద వర్షపాతమని వెల్లడించింది. దేశంలో నాలుగు నెలల్లో సగటున(ఎల్‌పీఏ) 109 శాతం వర్షం కురిసింది. సాధారణం కంటే అధికంగా జూన్‌లో 118 శాతం, ఆగస్టులో 127, సెప్టెంబర్‌లో 104 శాతం వర్షం పడింది. జూలైలో మాత్రం కేవలం 90 శాతం వర్షం కురిసింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు సగటున 95.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జాతీయ వాతావరణ అంచనా కేంద్రం(ఎన్‌డబ్ల్యూఎఫ్‌సీ) శాస్త్రవేత్త ఆర్‌కే జెన్మానీ తెలిపారు. ఈసారి 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, మేఘాలయా, గోవా, తమిళనాడు, కర్ణాటక, లక్షద్వీప్‌లో సాధారణ కంటే అధిక వర్షాలు కురిశాయి. ఆగస్టులో ఎల్‌పీఏ 127గా నమోదైంది. గత 44 ఏళ్లలో ఒక నెలలో ఈ స్థాయిలో వర్షం పడడం ఇదే మొదటిసారి. 1976 ఆగస్టులో 128.4 ఎల్‌పీఎ నమోదైంది.
రికార్డు స్థాయిలో పంటల సాగు
భారత్‌లో వర్షాల సీజన్ జూన్ 1న మొదలై సెప్టెంబర్ 30న ముగుస్తుంది. దేశంలో వార్షిక వర్షపాతంలో 70 శాతం వర్షాలు నైరుతి రుతుపవనాల వల్లే కురుస్తాయి. దేశంలో ఈసారి మంచి వర్షాలు కురవడంతో రైతన్నలు రికార్డు స్థాయిలో గత వారం నాటికి 1,116.88 లక్షల హెక్టార్లలో పంటలు వేశారని కేంద్ర వ్యవసాయ శాఖ తెలియజేసింది. గత సంవత్సరం కేవలం 1,066.06 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయని గుర్తుచేసింది.
Comments
Please login to add a commentAdd a comment