![India rejects Pakistans criticism of Ram Mandir Bhoomi Pujan - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/6/Ram-Mandirr.jpg.webp?itok=jh7zTDo8)
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనుల ప్రారంభంపై పాకిస్తాన్ విమర్శలను భారత్ గురువారం తోసిపుచ్చింది. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం పొరుగుదేశం మానుకోవాలని హితవు పలికింది. భారత అంతర్గత విషయాల్లో తలదూర్చడం సరికాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పాక్‌కు చురకలు అంటించారు. భారత వ్యవహారాల్లో పాకిస్తాన్ ప్రకటనలను పరిశీలించామని, తమ అంతర్గత వ్యవహారాల్లో పొరుగుదేశం జోక్యం చేసుకోరాదని, మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని ఆయన పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, తమ దేశంలో మైనారిటీల మతపరమైన హక్కులను నిరాకరిస్తున్న పొరుగుదేశం వైఖరి ఆశ్చర్యం కలిగించకపోయినా ఇలాంటి వ్యాఖ్యలు విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి : భూమి పూజపై పాక్ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా బుధవారం భూమిపూజ అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా, రామమందిర నిర్మాణానికి శంకుస్ధాపన కార్యక్రమం నిర్వహించడంపై పాకిస్తాన్ విమర్శలు కురిపించింది. భారత సుప్రీంకోర్టు వెల్లడించిన లోపభూయిష్ట తీర్పుతో మందిర నిర్మాణానికి మార్గం సుగమమైందని పాక్ వ్యాఖ్యానించింది. ఇది న్యాయం పట్ల విశ్వాసం సన్నగిల్లడమే కాకుండా భారత్‌లో ముస్లింలు, వారి ప్రార్ధనా స్ధలాలపై దాడులు పెరుగుతున్న తీరుకు అద్దం పడుతోందని పేర్కొంది. భారత్‌లో మైనారిటీలను అణిచివేసేలా మెజారిటీవాదం ప్రబలుతోందని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment