పిల్లల చదువుల కంటే రెట్టింపు ఖర్చు
సగటు వార్షికాదాయంతో పోలిస్తే 3 రెట్లు
ఖర్చులో మూడో వంతు ఆభరణాలకే
అంబానీల పెళ్లిసందడి దేశంతో పాటు ప్రపంచమంతటి దృష్టినీ తెగ ఆకర్షిస్తోంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలు, అందుకు జరుగుతున్న ఖర్చు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. ఈ సంరంభానికి అంబానీలు దాదాపు రూ.5,000 కోట్ల దాకా వెచ్చిస్తున్నారన్న వార్తలతో అంతా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అయితే పెళ్లి ఖర్చు విషయంలో భారతీయులెవరూ తక్కువ తినలేదు. మన దేశంలో పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు మాత్రమే కాదు.
బోలెడంత ఖర్చు కూడా. ప్రపంచంలో మరే ఇతర దేశంతో పోల్చినా భారత్‌లో పెళ్లి బాగా ఖరీదైన వ్యవహారం. పిల్లల మొత్తం చదువు ఖర్చుతో పోలిస్తే పెళ్లికి హీనపక్షం నాలుగు రెట్లు ఎక్కువ వెచ్చించాల్సిన పరిస్థితి. సగటు కుటుంబంలో పెళ్లి ఖర్చు వార్షికాదాయం కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువగా ఉంటోంది. అందులో ఎక్కువ మొత్తం నగానట్రాకే అవుతుండటం మరో విశేషం. పెళ్లి దెబ్బకు చాలా కుటుంబాలు ఆర్థికంగా తలకిందులవుతున్న ఉదంతాలెన్నో. అయినా సరే, పెళ్లి ఖర్చు విషయంలో మాత్రం మనోళ్లు తగ్గేదే లేదంటున్నారు...!
భారత రిటైల్ మార్కెట్ పరిమాణం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.94.3 లక్ష కోట్లకు చేరింది. అంటే 1.1 ట్రిలియన్ డాలర్లన్నమాట! ఇందులో రూ.56.9 లక్షల కోట్లతో ఫుడ్ అండ్ గ్రోసరీస్ విభాగం తొలి స్థానంలో ఉంటే రెండో స్థానం పెళ్లిళ్లదే కావడం విశేషం. భారత వెడ్డింగ్ మార్కెట్ విలువ ఎంతో తెలుసా? అక్షరాలా 10.9 లక్షల కోట్ల రూపాయలు! ఇందులో దాదాపు మూడో వంతు వాటా, అంటే రూ.3.1 లక్షల కోట్లు ఆభరణాల ఖర్చుదే కావడం విశేషం! తర్వాత విందు భోజనాలపై రూ.2.1 లక్షల కోట్లు వెచి్చస్తున్నారు. సంగీత్, హల్దీ వంటి పెళ్లి వేడుకలకు రూ.1.6 లక్షల కోట్లు ఖర్చవుతోంది. ఇక పెళ్లి ఫొటోగ్రఫీ వాటా 0.9 లక్షల కోట్లు. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు దుస్తులకు, పెళ్లి డెకరేషన్‌కు చెరో రూ.0.8 లక్షల కోట్ల చొప్పున ఖర్చవుతోంది. మద్యం, కానుకలు, ఇతర పెళ్లి ఖర్చులు కలిపి రూ.1.9 లక్షల కోట్ల దాకా అవుతున్నాయి.
చదువును మించి...
భారత్‌లో చదువుకు, పెళ్లికి అయ్యే ఖర్చుల మధ్య ఆశ్చర్యకరమైన తేడా కనిపిస్తోంది. సాదాసీదా కుటుంబం ఒక్క సంతానం చదువుకు కేజీ నుంచి పీజీ దాకా పెట్టే మొత్తం ఖర్చు సగటున రూ.3.3 లక్షలు. కాగా అదే కుటుంబం ఒక్క పెళ్లిపై వెచ్చిస్తున్నదేమో ఏకంగా రూ.12.5 లక్షలు! ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారనుకున్నా వారి చదువు ఖర్చుకు రెట్టింపు మొత్తం ఒక్క పెళ్లిపై పెట్టాల్సి వస్తోంది. భారతీయుల తలసరి జీడీపీ (రూ.2.4 లక్షల)తో పోలిస్తే పెళ్లి ఖర్చు ఏకంగా ఐదు రెట్లు ఎక్కువగా ఉంటోంది. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి ఏ సంపన్న దేశంలో చూసినా పెళ్లి ఖర్చు పౌరుల తలసరి జీడీపీతో పోలిస్తే సగం కంటే తక్కువ (0.4 రెట్లు)గానే ఉంది. మరో విషయం. మన దగ్గర ఒక కుటుంబం పెళ్లి కోసం తమ సగటు వార్షికాదాయానికి కనీసం మూడు రెట్లు వెచి్చస్తోంది!
మన దేశంలో పెళ్లి ఖర్చు
కుటుంబం ఖర్చు
పేద రూ.3 లక్షలు
దిగువ మధ్య తరగతి రూ.6 లక్షలు
మధ్య తరగతి రూ.10–25 లక్షలు
ఓ మాదిరి సంపన్నులు రూ.50 లక్షలు
సంపన్నులు రూ.కోటి, ఆ పైన
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment