![INDIA will defeat BJP, not seeking any post Says Mamata Banerjee - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/22/210720232828-PTI07_21_2023_.gif.webp?itok=D-pbKn_5)
కోల్‌కతా: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్, ఇంక్లూజివ్ అలయెన్స్) కూటమి బీజేపీని తప్పక ఓడిస్తుందని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. అమరుల వార్షిక దినోత్సవ ర్యాలీలో ఆమె ప్రసంగించారు. ‘బీజేపీని ఓడించేందుకు 26 రాజకీయ పార్టీలు ఏకం కావడం సంతోషంగా ఉంది. వారందరికీ ధన్యవాదాలు. ఇకపై బీజేపీ çహారేగా.. భారత్ జీతేగా అనేదే మా నినాదం. మా భవిష్యత్ కార్యక్రమాలన్నీ ఇండియా వేదికగానే జరుగుతాయి’అని ఆమె స్పష్టం చేశారు. కూటమి గెలుపుపైనే తన దృష్టంతా ఉందని, ఏ పదవినీ ఆశించడం లేదని తెలిపారు.
దేశంలో శాంతిని, బీజేపీ ఓటమినే తాము కోరుకుంటున్నామన్నారు. ప్రజలు బీజేపీని అధికారం నుంచి తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని మమత తెలిపారు. 2024లోనూ బీజేపీయే మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదన్న విషయం మనందరం గుర్తుంచుకోవాలని చెప్పారు. మణిపూర్ సంక్షోభంపై ఆమె తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘బేటీ బచావో’ మన కూతుళ్లను కాపాడుకుందాం పథకం ఇప్పుడు ‘బేఠీ జలావో’ మన కూతుళ్లను కాల్చివేద్దాంగా మారిందన్నారు. ప్రతిపక్ష కూటమిలోని నేతలంతా మణిపూర్ ప్రజలకు అండగా నిలుస్తారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment