ప్రమాద స్థలంలో ఛాపర్ శకలాలు
భారత ఆర్మీ ఛాపర్ చీతా ప్రమాదం.. విషాదంగా ముగిసింది. పైలట్ లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డితో పాటు కో పైలట్ మేజర్ జయంత్ కూడా మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించింది ఆర్మీ.
గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చీతా ఎయిర్‌క్రాఫ్ట్.. సంగే గ్రామం నుంచి అసోం సోనిట్‌పూర్ జిల్లా మిస్సమారి వైపు వెళ్లాల్సి ఉంది. అయితే పావు గంటకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ కామెంగ్ జిల్లా మండాలా వద్ద అది ప్రమాదానికి గురైనట్లు ఆర్మీ వర్గాలు గుర్తించాయి. అయితే.. ఆపై అందులో ఉన్న ఇద్దరు పైలట్ల ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది.
భారత సైన్యంతో పాటు ఐటీబీపీ మరో రక్షణ విభాగ సాయంతో మొత్తం ఐదు బృందాలు కూలిపోయిన పైలట్ల ఆచూకీ కోసం గాలించాయి. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ దిరాంగ్ ప్రాంతం బంగ్లాజాప్ వద్ద గ్రామస్తులు కాలిపోతున్న ఛాపర్ శకలాలను గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి చేరుకున్న బలగాలు.. ఆపై పైలట్, కోపైలట్‌లు దుర్మరణం పాలైనట్లు ప్రకటించారు.
ఛాపర్ క్రాష్‌కు గురైన ప్రాంతంలో పొగమంచు దట్టంగా నిండిపోయి ఉండడం, కమ్యూనికేషన్ అండ్ సిగ్నలింగ్ వ్యవస్థకు ఆటంకం కలుగుతోందని గుర్తించారు. మరోవైపు ప్రమాదానికి కారణాల గుర్తించేందుకు దర్యాప్తునకు ఆదేశించింది భారత ఆర్మీ.
చీతా ఐదుగురు ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న హెలికాఫ్టర్. అనేక రకాలుగా దీనిని ఉపయోగిస్తున్నారు. ప్రతికూల వాతావరణంలోనూ.. మిషన్ల సమయంలో అత్యంత ఎత్తులో(ప్రపంచ రికార్డు సైతం ఉంది దీనిపేరిట) అయినా ప్రయాణించగలిగే సత్తా ఉందన్న పేరుంది. హాల్(HAL) 1976-77 నడుమ తొలి ఛాపర్‌ను భారత సైన్యానికి అందించింది. ఇప్పటిదాకా 279 హెలికాఫ్టర్‌లను హాల్.. భారత్‌తో పాటు విదేశాల్లోనూ అందించింది.
Comments
Please login to add a commentAdd a comment