జమ్ము ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపధ్యంలో ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో సైనికులను మోహరించారు. జమ్ములో ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇంటర్ కమాండ్‌లో మార్పులు చేశారు. కథువా, సాంబా, దోడా, బదర్వా, కిష్త్వార్‌లలో సైనికుల సంఖ్యను మరింతగా పెంచారు. వెస్ట్రన్ కమాండ్ నుండి కూడా ఇక్కడకు సైనికులను పంపారు.
గత సోమవారం జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్‌కు చెందిన సాయుధ ఉగ్రవాదులతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో కెప్టెన్‌తో సహా నలుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. మూడు వారాల్లో జమ్మూ ప్రాంతంలో ఇది మూడో అతిపెద్ద ఉగ్రవాద ఘటన. దీనికి ముందు కథువా జిల్లాలో ఉగ్రవాదులు ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. అంతేసంఖ్యలో సైనిక సిబ్బంది గాయపడ్డారు.
అంతకుముందు జూలై 9న కిష్త్వార్ జిల్లా సరిహద్దుల్లోని అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత ఉగ్రవాదులు పారిపోయారు. జూన్ 26న గండో ప్రాంతంలో ఒక రోజంతా జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అదేవిధంగా జూన్ 12న జరిగిన భీకర కాల్పుల్లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది, ఒక ప్రత్యేక పోలీసు అధికారి గాయపడటంతో దోడాలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు ముమ్మరం చేశారు.
గండోలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఒక పోలీసు గాయపడ్డాడు. 2005- 2021 మధ్య భద్రతా దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించిన తర్వాత జమ్ము ప్రాంతం సాపేక్షంగా శాంతియుతంగా ఉంది. అయితే ఈ ప్రాంతంలో గత నెల నుంచి ఉగ్రవాద దాడులు పెరిగాయి. ఇటీవల యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన దాడిలో తొమ్మిది మంది మృతిచెందగా, 40 మంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment