న్యూఢిల్లీ: రష్యాలోని భారతీయులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి దూరంగా ఉండాలని కేంద్ర విదేశాంగశాఖ సూచించింది. ఈ మేరకు ఒక అడ్వైజరీని జారీ చేసింది. ఈ విషయమై శుక్రవారం విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
కొందరు భారతీయులు రష్యాలో సైనికులకు సహాయకులుగా ఉండేందుకు అంగీకరిస్తూ కాంట్రాక్టులపై తెలియక సంతకాలు చేశారని జైస్వాల్ చెప్పారు. తాము ఈ విషయమై రష్యా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రష్యాలో ఆర్మీ హెల్పర్లుగా పనిచేస్తున్న భారతీయులను విడుదల చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.
కాగా, ఇప్పటికే ఎంఐఎం చీఫ్,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ అంశాన్ని ఇప్పటికే విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకొచ్చారు. భారత్ నుంచి మొత్తం 12 మంది యువకులు దళారుల మాటలు విని మోసపోయి రష్యాకు వెళ్లారని తెలిపారు. వీరిలో తెలంగాణ వాసులు ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. మిగిలినవారు కర్ణాటక, గుజరాత్, కశ్మీర్, యూపీలకు చెందినవారన్నారు. రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వీరందరినీ ఏజెంట్లు మోసం చేశారని ఆరోపించారు. బాధిత కుటుంబాలు తనకు మొరపెట్టుకోవడంతో విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌తో పాటు రష్యాలో భారత రాయబారికి కూడా లేఖలు రాశానన్నారు. ప్రభుత్వం చొరవ చూపి వారిని స్వస్థలాలకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి.. ప్రధాని మోదీపై గూగుల్ జెమిని వివాదాస్పద సమాధానం
Comments
Please login to add a commentAdd a comment