సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు దేశాల్లోని పరిశ్రమలన్నీ ఏదో మేరకు నష్టపోగా, ఐటీ పరిశ్రమ మాత్రం నిలదొక్కుకొని నిలబడడం ‘గుడ్డిలో మెల్ల మేలు’ చందంగా ఉందనడంలో సందేహం లేదు. ఐటీ పరిశ్రమ యథావిధిగా కొనసాగుతూ ఐటీ సర్వీసులకు డిమాండ్ కూడా పెరగుతుండడంతో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఉద్యోగావకాశాలు కూడా పెరగతూ వస్తున్నాయి. సెప్టెంబర్ నెల నాటికి హార్డ్‌వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు 63 శాతం పెరగ్గా, సాఫ్ట్‌వేర్ రంగంలో 20 శాతం పెరిగాయని ‘నౌకరీ డాట్ కామ్’ తాజాగా విడుదల చేసిన నివేదిక తెలియజేస్తోంది. (వాట్సప్ ఓటీపీతో జర జాగ్రత్త!)
వాస్తవానికి సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు కరోనా మహమ్మారికి ముందున్నంతగా లేవు. తక్కువగా ఉన్నాయి. అయితే హార్డ్‌వేర్ రంగంలో ఎక్కువగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా ఉద్యోగావకాశాలు లేదా నియామకాలు కేవలం మూడు శాతంతో గత 15 ఏళ్లలో ఎన్నడు లేనంత తక్కువ స్థాయిలో ఉంది. ఐటీ పరిశ్రమ అంతగా దెబ్బ తినకపోయినప్పటికీ దేశంలో ఇతర పరిశ్రమలు ఎక్కువగా దెబ్బతిన్న కారణంగా దేశంలో నిరుద్యోగుల శాతం సెప్టెంబర్ నెలలో 6.67 శాతం ఉండగా, అక్టోబర్ నెల నాటికి 6.98 శాతానికి చేరుకుంది. ఐటీ రంగంలో ఐబీఎం, కోగ్నిజెంట్, అక్సెంచర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, డెల్, టెక్‌మహీంద్ర, మైండ్ ట్రీ, గ్జిరాక్స్, అడోబ్ లాంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు పెరగతున్నాయి. భారత సిలీకాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు నగరంలోనే కొత్త ఉద్యోగావకాశాలు ఎక్కువగా పెరిగాయి. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, హైదరాబాద్, పుణె నగరాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment