గతేడాది ఆగస్టు 23న చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపిన సమయంలోనూ ఆయన అంత సంతోష పడలేదేమో, చంద్రయాన్-3 సక్సెస్‌తో దేశ విదేశాల నుంచి పొగడ్తలు అందుకున్నప్పుడు కూడా ఆయన ఇంత ఆనందంగా లేరేమో.. ఆయన ఎవరో కాదు.. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్.. ఇప్పుడు ఆయన గురించి ఎందుకంటే.. ఇన్నెళ్లకు సోమనాథ్ తన కల నెరవేర్చుకున్నారట.
ఐఐటీ మద్రాస్ 61వ కన్వోకేషన్ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ అక్కడ మెరిశారు. అతిథిగా అనుకునేరు.. కానే కాదు..61 ఏళ్ల వయసులో ఆయన తన పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం ఆయన చంద్రుడిపై కాలు మోపినం సంతోషంలో ఉన్నారు. యూనివర్సిటీ అధికారుల నుంచి డాక్టరేట్ పొందుతున్న సమయంలో ఆయన ముఖంలో మెరిసిన ప్రకాశవంతమైన చిరునవ్వు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతోంది.
డాక్టరేట్ అందుకున్న తర్వాత సోమనాథ్ మాట్లాడుతూ.. ‘‘నాది గ్రామీణ నేపథ్యం. క్లాస్‌లో టాపర్‌ని. అయినా కూడా ఐఐటీ ఎంట్రన్స్ రాయాలనే ధైర్యం ఏనాడూ చేయలేకపోయా. కానీ, ఏదో ఒకనాడు ఇక్కడి నుంచి పట్టా పొందాలని మాత్రం కల గన్నా. నా మాస్టర్ డిగ్రీ బెంగళూరు ఐఐఎస్ నుంచి తీసుకున్నా. ఇప్పుడు పీహెచ్‌డీ ఐఐటీ మద్రాస్ నుంచి తీసుకోవడం గౌరవంగా ఉంది.
పీహెచ్‌డీ అనేది కష్టమైంది. అదీ మద్రాస్ ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నుంచి డిగ్రీ పొందడం ఇంకా కష్టం. నాది సుదీర్ఘమైన ప్రయాణం. ఎన్నో ఏళ్ల కింద రిజిస్టర్ చేయించుకున్నా. వైబ్రేషన్ ఐసోలేటర్స్.. నా మనసుకి దగ్గరైన టాపిక్. 35 ఏళ్ల నా కష్టానికి దక్కిన ఫలితం ఇది. ఇన్నేళ్ల నా శ్రమను పీహెచ్‌డీ కిందకు మార్చుకున్నా.’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఇప్పటి నుంచి డాక్టర్ సోమనాథ్ అన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment