సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) శనివారం ఉదయం మొట్టమొదటగా ప్రయోగించనున్న గగన్‌యాన్ టెస్ట్ వెహికల్ (టీవీ–డీ1) ప్రయోగానికి శుక్రవారం సాయంత్రం 7.30 గంటలకు కౌంట్‌డౌన్ మొదలైంది. 12.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం శనివారం ఉదయం 8 గంటలకు ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్దం చేశారు. షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి సింగిల్ స్టేజీతో (ఒకే దశతో) ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు.
531.8 సెకన్లకు ప్రయోగాన్ని పూర్తి చేయనున్నారు. టీవీ–డీ1ను 17 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకెళ్లి రాకెట్ శిఖరభాగాన అమర్చిన క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టంను మళ్లీ కిందకు తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టడం ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం.
రాకెట్ శిఖరభాగంలో అమర్చిన క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం భూమికి 17 కిలోమీటర్లు దూరంలో అంతరిక్షంలో వదిలిపెట్టిన తరువాత దానికి పైభాగంలో అమర్చిన 10 ప్యారాచూట్ల సాయంతో బంగాళాఖాతంలో దించి సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియను చేపడుతున్నారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కోస్టల్ నేవీ సిబ్బంది ఒక ప్రత్యేక బోట్‌లో వేచి ఉండి సముద్రంలో క్రూమాడ్యూల్ పడిన తరువాత దాన్ని సురక్షితంగా తీసుకొస్తారు. భవిష్యత్తులో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి క్షేమంగా తీసుకువచ్చే ప్రక్రియను పరిశీలించే ప్రయోగం ఇదే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment