జామ్‌నగర్: గుజరాత్‌లోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా జామ్‌నగర్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయ్యింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో మీడియా బృందం జామ్ నగర్‌లో పర్యటించింది. జామ్‌నగర్‌లో వరదలు, వర్షాల కారణంగా ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందారు. 500కు పైగా పశువులు ప్రాణాలు కోల్పోయాయి.
వర్షాల అనంతం జామ్‌నగర్‌లోని తీన్ బత్తి చౌక్ ప్రాంతంలోని బద్రీ కాంప్లెక్స్ బేస్‌మెంట్‌లో నీరు నిలిచిపోయి, బురద పేరుకుపోయింది. విపరీతమైన దుర్వాసన కూడా వస్తోంది. కాంప్లెక్స్‌లో వర్షాలకు ముద్దయిన సరుకులను సంబంధిత దుకాణాల యజమానులు ట్రాక్టర్లలో ఎక్కించుకుని తీసుకువెళుతున్నారు.
ఇక్కడకు కొద్ది దూరంలో ఉన్న మదీనా మసీదు సమీపంలో కూడా ఇటువంటి పరిస్థితే కనిపించింది. రోడ్లన్నీ బురదమయంగా మారాయి. గుంతల్లో నీరు నిలిచిపోయింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు బాధితులకు నిత్యావసర సరుకులను అందిస్తున్నాయి. మీడియాను చూసిన అక్కడి మహిళలు తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వేడుకున్నారు.
ఘాచీ కి ఖడ్కీలో వర్షాల అనంతరం పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యింది. దీంతో స్థానికులు తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ ప్రాంతమంతా చెత్తాచెదారంతో నిండిపోయింది. రోడ్లపై అడుగుతీసి అడుగువేయలేనంతగా బురద పేరుకుపోయింది.
Comments
Please login to add a commentAdd a comment