నీట్, జేఈఈల వాయిదా ఉండదు! | JEE-NEET exams should not be postponed | Sakshi
Sakshi News home page

నీట్, జేఈఈల వాయిదా ఉండదు!

Published Fri, Aug 28 2020 3:02 AM | Last Updated on Fri, Aug 28 2020 8:32 AM

JEE-NEET exams should not be postponed - Sakshi

న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, వైద్యవిద్యల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ, నీట్‌ పరీక్షల వాయిదా ఉండదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణ ఆలస్యం చేసే కొద్దీ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని అభిప్రాయపడింది. ఈ పరీక్షలు వాయిదా వేయాలంటూ కొందరు విద్యార్థులు, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే! అయితే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పరీక్షలకు సన్నాహాలు ఆరంభించిన ప్రభుత్వం బుధవారం అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. గురువారం ఉదయానికి దాదాపు 16 లక్షల మందికి పైగా విద్యార్థులు అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపింది.

డౌన్‌లోడ్స్‌ భారీగా ఉండడం విద్యార్థులు పరీక్షను కోరుకుంటున్నారనడానికి గుర్తని విద్యాశాఖ మంత్రి రమేశ్‌ నిశాంక్‌ పోఖ్రియాల్‌ వ్యాఖ్యానించారు. పరీక్ష నిర్వహించాల్సిందిగా తల్లిదండ్రులు, పలువురు విద్యార్థులు తమకు మెయిల్స్‌ పంపారని వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 7–11 మధ్యకాలంలో జేఈఈ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా కోవిడ్‌ నేపథ్యంలో ముందుగా జూలై 18 –23కు తాజాగా సెప్టెంబరు 1 –6కు వాయిదా పడింది. వైద్య విద్య ప్రవేశానికి నిర్వహించే నీట్‌ ఈ ఏడాది మే 3వ తేదీన జరగాల్సి ఉండగా జూలై 26వ తేదీకి తాజాగా సెప్టెంబర్‌ 13కు వాయిదా పడింది. జేఈఈలో 9.53 లక్షల మంది, నీట్‌లో 15.97 లక్షల మంది పాల్గొనే అవకాశముంది.

వాయిదా అంటే వినాశనమే..
జేఈఈ, నీట్‌ పరీక్షలను మరింత కాలం వాయిదా వేయడం విద్యార్థుల భవిష్యత్తుతో రాజీపడటమేనని దేశ విదేశాలకు చెందిన సుమారు 150 మంది విద్యావేత్తలు ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు.  సొంత రాజకీయ ఎజెండాల అమలుకు కొందరు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని లేఖలో ఆరోపించారు. ‘‘యువత, విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తు. అయితే కోవిడ్‌–19 నేపథ్యంలో వారి కెరీర్‌పై నీలినీడలు అలుముకొన్నాయి. కోర్సుల్లో ప్రవేశం మొదలుకొని పలు అంశాలపై ఏర్పడిన అస్పష్టతను వీలైనంత వేగంగా తొలగించాల్సిన అవసరం ఉంది. జేఈఈ మెయిన్స్, నీట్‌ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే తేదీలు ప్రకటించింది.

ఇంకా జాప్యం చేస్తే విద్యార్థుల విలువైన విద్యాసంవత్సరం వృథా అవుతుంది. యువత, విద్యార్థుల భవిష్యత్తు కలలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ తగదు’’ అని పేర్కొన్నారు. లేఖపై సంతకం చేసిన వారిలో ఢిల్లీ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, లక్నో యూనివర్సిటీ, జేఎన్‌యూ, బీహెచ్‌యూ, ఐఐటీ ఢిల్లీలతోపాటు లండన్, కాలిఫోర్నియా, హీబ్రూ, బెన్‌ గురియాన్‌ యూనివర్సిటీల విద్యావేత్తలు ఉన్నారు. పరీక్షలు జాప్యం జరిగితే ఈ విద్యా సంవత్సరం జీరో విద్యా సంవత్సరంగా మారుతుందని, ఇది అనేక విపరిణామాలకు దారితీస్తుందని ఐఐటీ రూర్కీ, ఖరగ్‌ పూర్, రోపార్, గాంధీనగర్, గువాహటి డైరెక్టర్లు అభిప్రాయపడ్డారు.

వ్యవస్థపై విద్యార్ధులు నమ్మకముంచాలన్నారు. మరోవైపు జేఈఈ, నీట్‌ పరీక్షల నిర్వహణపై కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలు చేస్తోందని బీజేపీ గురువారం ఆరోపించింది. వాయిదా వల్ల విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతారని వాదనలు వస్తున్న నేపథ్యంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ కాస్త మెత్తపడ్డట్లు కనిపించారు. ఈ విషయమై మాట్లాడుతూ ఆ పరీక్షలను పూర్తిగా నిలిపివేయమనడం లేదని, రెండు మూడు నెలలు వాయిదా వేయాల్సిందిగా కోరుతున్నానని చెప్పారు. పరీక్షలను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించిన ఏడు మంది ముఖ్యమంత్రుల్లో అమరీందర్‌ కూడా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement