
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన తిరిగి రాజ్యసభ ఎంపీ అవుతారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. జీపీ నడ్డాను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపవచ్చని సమాచారం.
జేపీ నడ్డా ఇటీవలే రాజ్యసభ పదవీకాలం పూర్తిచేసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేవని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. రాజ్యసభ ఎంపీలైన నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ పదవీకాలం మూడేళ్ల కంటే అధిక సమయం ఉంది. అందుకే వారికి లోక్‌సభ ఎన్నికలలో పోటీ నుండి మినహాయింపు ఉండవచ్చు. కాగా బీజేపీ నేతలు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, మురళీధరన్‌లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటానికి తోడు, అక్కడ బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో నడ్డా తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ నుండి రాజ్యసభకు వెళ్లే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ నుంచి జేపీ నడ్డా రాజ్యసభకు వెళ్లే అవకాశాలున్నాయనే మాట కూడా వినిపిస్తోంది. ఎన్నికల సంఘం ఇటీవల ఫిబ్రవరి 27న 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.