భోపాల్: మధ్యప్రదేశ్ ఎన్నికలలో బీజేపీ స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ చాలా చోట్ల ఓటమితో వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో తన ఎత్తుపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇప్పుడు స్పందించారు.
సింధియా ప్రభావం ఉన్న ప్రాంతంగా భావించే గ్వాలియర్ మాల్వా ప్రాంతంలో బీజేపీ ఆధిక్యాన్ని ఆయన ప్రస్తావిస్తూ ‘నా ఎత్తు గురించి ఎవరో మాట్లాడారు. గ్వాలియర్-మాల్వా ప్రజలు ఎంత ఎత్తులో ఉన్నారో చూపించారు’ అన్నారు.
గత నెలలో డాటియాలో జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ.. సింధియాపై విరుచుకుపడ్డారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన ‘ద్రోహ’ అని ముద్ర వేశారు. ‘వాళ్ల (బీజేపీ) నాయకులందరూ కొంచెం విచిత్రంగా ఉంటారు. ముందుగా మా సింధియా.. నేను యూపీలో అతనితో కలిసి పనిచేశాను. వాస్తవానికి అతని ఎత్తు కొంచెం తక్కువగా ఉంది. కానీ అహంకారంలో మాత్రం ఘనుడు’ అంటూ విమర్శించారు.
ఎన్‌డీటీవీతో సింధియా మాట్లాడుతూ ‘బీజేపీ గెలుస్తుందని నేను ముందే చెప్పాను. మాకు ఇంత పెద్ద మెజారిటీని అందించిన మధ్యప్రదేశ్ ఓటర్లకు ధన్యవాదాలు. బీజేపీ ప్రధాని మోదీ నాయకత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మార్గదర్శకత్వం పనిచేసింది’ అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అందించిన ప్రజా, సంక్షేమ పథకాలు కూడా పార్టీ విజయానికి దోహదం చేశాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment