ఎప్పుడో రెండు నెలల కిందట మొదలైన ‘కచ్చా బాదాం’ మేనియా.. మళ్లీ తెర మీద ఊపేస్తోంది. అందుకు కారణం.. అంజలీ అరోరా అనే అమ్మాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ తరుణంలో తన ఇన్‌స్టా రీల్‌లో హాట్ హాట్‌గా చిందులేసిన ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేశారనే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. అంతేకాదు.. కచ్చా బాదం సాంగ్ హక్కులు తన పేర ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ ఈ పాట ఒరిజినల్ క్రియేటర్ పోలీసులను ఆశ్రయించాడంటూ కొన్ని మీడియా హౌజ్‌లలో కథనాలు వెలువడుతున్నాయి. ఇంతకీ ఈ కచ్చా బాదం లొల్లి ఏంటి? వైరల్ అవుతున్న ఆ వార్తల్లో నిజమేంత? చూద్దాం..
ఏడాది కిందట.. గల్లీలలో సైకిల్ మీద, బైక్ మీద తిరుగుతూ పచ్చి పల్లీలు(కచ్చా బాదాం) అమ్ముకునే ఓ వ్యక్తి పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ‘పాత సామాన్లు ఇచ్చి.. పచ్చి పల్లీలు తీసుకెళ్లండంటూ’ గల్లీలో తిరుగుతూ తనదైన శైలిలో పాడుతూ జనాల్ని ఆకట్టుకునేవాడు భూబన్ బద్యాకర్. అతని వీడియోలు కొన్ని వాట్సాప్ స్టేటస్‌ల ద్వారా ‘ఎక్‌తారా’ అనే యూట్యూబ్ ఛానెల్‌కు చేరాయి. దీంతో ఒక ఫుల్‌లెంగ్త్ వీడియో తీసి, ఎడిట్ చేసి యూట్యూబ్‌లో వదలడంతో 21 మిలియన్‌కి పైగా వ్యూస్ వచ్చాయి. అలా కచ్చా బాదాం వెర్షన్ ఫేమస్ కావడం మొదలైంది.
ఆపై ఆ పాట ఇన్‌స్టాగ్రామ్‌కు చేరగా.. సింగర్, మ్యూజీషియన్ నజ్మూ రియాఛాట్ ఆ వీడియోను రీమిక్స్ చేసి వదిలాడు. అలా ఆ రీమిక్స్ వెర్షన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ కావడం మొదలైంది. మరోవైపు బాదం అఫీషియల్ ర్యాప్ వెర్షన్‌ను భూబన్‌తో కలిసి కట్టారు రోన్‌ఈ, ప్రగ్యా అనే ర్యాపర్లు. అలా యూట్యూబ్‌కు అఫీషియల్‌గా ర్యాప్ సాంగ్ ద్వారా పరిచయం అయ్యాడు ఆ పల్లీలు అమ్ముకునే చిరువ్యాపారి. ఆ వీడియోకు ఇప్పటిదాకా 33 మిలియన్ వ్యూస్‌పైగా వచ్చాయి. ఆపై ఎన్నెన్నో వెర్షన్‌లు వస్తూనే ఉన్నాయి. కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కచ్చా బాదాం పాపులర్ అయ్యింది మాత్రం నజ్మూ రియాఛాట్ వెర్షన్‌తోనే!.
రండమ్మా.. రండి
పశ్చిమ బెంగాల్‌లోని లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామం.. భూబన్ స్వస్థలం. భార్యతో పాటు ముగ్గురు పిల్లల తండ్రైన భూబన్.. పచ్చి పల్లీలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పల్లీలు ఇస్తూ.. వాటిని జంక్ షాపుల్లో అమ్మి జీవనం కొనసాగిస్తున్నాడు. అలా అమ్మేయగా వచ్చిన డబ్బు రూ.250 నుంచి 300రూ. మాత్రమే. ఆ అమ్మడంలోనూ.. స్థానిక భాషలో అరవడంలోనూ ప్రత్యేకత ఉండాలనేది అతని తాపత్రయం. అదే అతనిని ఓవర్ నైట్ సెన్సేషన్ చేసేసింది.
అందిన ఆర్థిక సాయం..
కచ్చా బాదం పాట ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. నెటిజనులు, స్థానిక నేతల దగ్గరి నుంచి సెలబ్రిటీల దాకా అంతా అడిక్ట్ అయిపోయారు. కొరియాతో పాటు ఆఫ్రికా దేశాలకు సైతం పాకేసింది. షార్ట్ వీడియోస్‌లో రికార్డు స్థాయిలో వీడియోలతో కచ్చా బాదం రీమిక్స్ ఏలుతుండగా.. ఆ సాంగ్ ఒరిజినల్ క్రియేటర్ భూబన్ బద్యాకర్‌కి తగిన గుర్తింపూ దక్కింది. ఒకానొక దశలో పాట మీద రైట్స్ కోసం ఆయన్ని పోలీసులను ఆశ్రయించాడనే వార్త ఒకటి చక్కర్లు కొట్టింది.
అయితే అందులో వాస్తవం ఉంది. అయితే ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కాపీ రైట్స్ వ్యవహారం తమ చేతుల్లో లేదంటూనే.. భూబన్‌కి కొంత ఆర్థిక సాయం చేశారు. అంతేకాదు పలువురు పొలిటీషియన్లు, స్థానికులు, ఆయనకు చాలా సాయం అందించారు. ప్రభుత్వం కూడా స్పందించి.. తనకు ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతున్నాడు భూబన్. ఎప్పటిలాగానే తన వ్యాపారం చేసుకుంటూ.. అడపా దడపా ఇంటర్నెట్‌లో కనిపించాలని అనుకుంటున్నాడు. అంతేకాదు త్వరలో టీమిండియా దాదా సౌరవ్ గంగూలీతో కలిసి ఓ రియాలిటీ షోలో(దాదాగిరి అన్‌లిమిటెడ్ సీజన్9లో) భూబన్ బద్యాకర్ సందడి చేయబోతున్నాడు. అదీ సంగతి!
ఎవరీ అంజలి..
అంజలి అరోరా.. వయసు 22 ఏళ్లు. టిక్‌టాక్ ఉన్న టైంలో పాపులర్ అయిన నార్త్ నిబ్బీ. ఢిల్లీకి చెందిన! అంజలి ఒకవైపు మోడల్‌గానే రాణిస్తూ.. ఆ పాపులారిటీతో కొన్ని షార్ట్ ఫిల్మ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తోంది. ఈ తరుణంలో కచ్చా బాదాం వెర్షన్‌కి ఈ అమ్మడు వేసిన స్టెప్స్ యూత్‌ని ఎట్రాక్ట్ చేసింది. ఆ ఒక్క వీడియోతో అంజలి ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు. అయితే ఆమె వీడియోస్‌ను తీసేది ఆమె తండ్రే. పైగా ఆమె చిందులూ హాట్ హాట్‌గా ఉన్నాయి. అందుకే ఆమెపై ట్రోలింగ్ కూడా అదే స్థాయిలో జరిగింది. నార్త్ నుంచి సౌత్ దాకా దేశం మొత్తం.. బాషాబేధాలకు అతీతంగా సోషల్ మీడియాలో ఆమె కచ్చా బాదాం వెర్షన్ వైరల్ అయ్యింది. అంజలి ఇన్‌స్పిరేషన్‌తో మరికొందరు అమ్మాయిలు సైతం అలాంటి డ్యాన్స్‌లకే ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు. ఈ తరుణంలో హాట్ డ్యాన్సులు వేసినందుకు ఆమె అరెస్ట్ అయ్యిందంటూ ఓ పుకారు చెలరేగగా.. అందులో వాస్తవం లేదని ఆమె తండ్రి స్థానిక మీడియా ఛానెల్స్‌కు వివరణ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment