
కలబురిగి నుంచి కల్వల మల్లికార్జున్‌రెడ్డి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ‘హైదరాబాద్–కర్ణాటక’ ప్రధాన రాజకీయ పక్షాలకు సవాల్ విసురుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లను సమానస్థాయిలో ఆదరించిన బీదర్, కలబురిగి ఓటర్లు బీదర్ దక్షిణ నియోజకవర్గంలో జేడీఎస్‌కు పట్టం కట్టారు. ఈ రెండు జిల్లాల పరిధిలో ఈసారి బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నుంచి దిగ్గజ నేతలు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కుటుంబాలకు చెందిన నాయకులు బరిలోకి దిగారు.
వీరిలో కొందరికి ప్రభుత్వ వ్యతిరేకత, మరికొందరికి స్థానిక వ్యతిరేకత తోడవుతుండటంతో ఫలితాలు తారుమారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మెజారిటీ స్థానాల్లో పార్టీలు, ఎజెండాలు, హామీలు పక్కన పెట్టి అభ్యర్థుల గుణగణాలకే ఓటర్లు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. గత ఐదేళ్లలో రెండు పార్టీలు, ముగ్గురు ముఖ్యమంత్రులు మారడంతో ‘సుస్థిర ప్రభుత్వం’ భావన ఓటర్లలో ప్రధానంగా కనిపిస్తోంది. ఈ నెల 10న జరిగే పోలింగ్‌లో ‘మార్పు’కు పట్టం కట్టేందుకు బీదర్, కలబురిగి ఓటర్లు సిద్ధమవుతున్నట్లు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది.
మూడు పార్టీల పాలన బేరీజు
40 శాతం కమీషన్ ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లగా, అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపం, పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలకు దూరంగా ఉండటం, హిజాబ్, ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, అవినీతి, రిజర్వేషన్లు వంటి అంశాలు బీజేపీపై ప్రభావం చూపుతున్నాయి. ప్రధాని మోదీ ఇమేజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ బీజేపీ ఓటర్లకు దగ్గరయ్యేందుకు యత్నిస్తోంది. పాత నేతలకే టికెట్లు ఇవ్వడం కూడా బీజేపీకి ప్రతికూలంగా పరిణమించే సంకేతాలున్నాయి.
సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనతో పోల్చిచూడటం కూడా బీజేపీకి కొంత ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా పాతనేతలకే టికెట్లు ఇచ్చి ప్రభుత్వ వ్యతిరేకత, స్థానికంగా బీజేపీ అభ్యర్థుల ప్రతికూలతలను అనుకూలంగా మలచుకునే వ్యూహంతో పనిచేస్తోంది. అయితే కాంగ్రెస్‌లో సిద్దరామయ్య, డీకే శివకుమార్ వర్గాల కుమ్ములాటలతో సుస్థిర ప్రభుత్వం సాధ్యం కాదనే అనుమానాలు ఓటర్లలో ఉన్నాయి.
బీజేపీ ప్రతికూల ఓటును జేడీఎస్ బలంగా చీల్చుకునే అవకాశం ఉండటం కూడా కాంగ్రెస్‌కు మైనస్‌గా మారే సూచనలున్నాయి. కరోనా సమయంలో సామాజిక సేవలో నిమగ్నమైన జేడీఎస్ అభ్యర్థుల పట్ల కొన్నిచోట్ల సానుకూలత కనిపిస్తోంది. జేడీఎస్ సొంత బలంతో అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేని ఓటర్లు స్థానికంగా బలమైన అభ్యర్థి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
మఠాధిపతుల ప్రభావం తగ్గుముఖం
బీదర్, కలబురిగి జిల్లాల్లోని 15 నియోజకవర్గాల్లో అలంద్, గుల్బర్గా ఉత్తర నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని చోట్లా లింగాయత్ సామాజిక వర్గ ఓటర్లే ఎక్కువ ఉన్నారు. గతంలో మాదిరిగా ఈ సామాజికవర్గంలో బీజేపీ వైపు ఏకపక్షంగా మొగ్గు కనిపించడం లేదు. మాజీ సీఎం యడియూరప్పను పదవి నుంచి తప్పించడంపై లింగాయత్ సామాజికవర్గంలో కొంతమేర అసంతృప్తి ఉంది.
గతంలో ఓటర్లను ప్రభావితం చేసిన పీఠాధిపతులు, మఠాధిపతులు ప్రస్తుత ఎన్నికల్లో ఏ పార్టీకీ బహిరంగ మద్దతు ప్రకటించకుండా గుంభనంగా ఉన్నారు. గుల్బర్గా ఉత్తర, దక్షిణ, రూరల్, బీదర్ దక్షిణ, ఉత్తర, హుమ్నాబాద్, అలంద్‌లో ముస్లిం ఓటర్లు ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండటంతో కాంగ్రెస్, జేడీఎస్‌లలో మైనారిటీ ఓటు బ్యాంకుపై ధీమా కనిపిస్తోంది.
నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి
కర్ణాటకలోనే వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన కలబురిగి, బీదర్ జిల్లాల నుంచి విద్యాధికులు బెంగళూరు, పుణే, హైదరాబాద్ వంటి నగరాలకు వలస పోతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, విద్యాసంస్థలు, సిమెంట్ కర్మాగారాల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండటంపై అసంతృప్తి కనిపిస్తోంది.
పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కొంత మెరుగ్గా ఉన్నా గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, డంప్‌యార్డులు ప్రధాన సమస్యగా ఉన్నాయి. ఏడో వేతన సవరణ జరగకపోవడంతోపాటు ప్రభుత్వ పనితీరుపై ఉద్యోగ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీలో వర్గీకరణ, ముస్లింల రిజర్వేషన్లు తొలగింపు వంటి అంశాలు కూడా ఎన్నికల ప్రచార ఎజెండాగా ఉన్నాయి.
బీదర్ దక్షిణ, బీదర్ ఉత్తర, ఔరాద్, చించోలి, సేడమ్ నియోజకవర్గాలపై తెలంగాణ ప్రభావం కొంతమేర కనిపిస్తోంది. తెలంగాణ మోడల్‌ను అమలు చేస్తామంటూ జేడీఎస్ తెలంగాణ ప్రభుత్వ పథకాలతో కూడిన కరపత్రాలతో సరిహద్దు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment