
సాక్షి, బెంగళూరు: కొత్త ఏడాదిలో తొలిసారి శాసనసభ సమావేశాలు నేడు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీ వరకు వారంపాటు జరుగుతాయి. తొలిరోజు గవర్నర్ వజూభాయ్‌వాలా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించి సభాపర్వానికి శ్రీకారం చుడతారు.
సీఎం ముందున్న ఇబ్బందులు
సీఎం యడియూరప్పకు ఈ సమావేశాలు సవాల్ అనే చెప్పాలి. మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుతో అసంతృప్తికి గురైన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు యడియూరప్పపై బహిరంగ విమర్శకు దిగారు. కరోనా వైరస్ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. పెన్షన్లు సహా అనేక సంక్షేమ పథకాలు నత్తనడకన నడుస్తున్నాయని విమర్శలున్నాయి. రైతుల సమస్యలు, రాబోయే వేసవికాలంలో తాగునీరు, విద్యుత్ కొరత, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తదితరాలు అసెంబ్లీలో వేడెక్కించే అవకాశముంది. ఖాళీగా ఉన్న విధానపరిషత్ ఉప సభాపతి పీఠం ఎవరిదనేది ఉత్కంఠగా మారింది. బుధవారం సీఎం యడియూరప్పతో జేడీఎస్ నేత బసవరాజు హొరట్టి భేటీ అయి దీనిపై చర్చించారు.
సౌధ వద్ద నిషేధాజ్ఞలు
శివాజీనగర: శాసనసభా సమావేశాల నేపథ్యంలో విధానసౌధ చుట్టుపక్కల ముందు జాగ్రత్తగా నిషేధాజ్ఞలను విధించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విధానసౌధ చుట్టూ ఫిబ్రవరి 5 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment