
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ కలకలం రేగింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యక్తిగత సిబ్బంది ఒకరు వలపు వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సీఎం బొమ్మై సంతకాలతో కూడిన కీలకమైన పత్రాలను అతను ఓ ముఠాకు అప్పగించినట్లు సమాచారం. ఈ మేరకు అందిన ఫిర్యాదు వివరాలను పోలీస్ వర్గాలు శుక్రవారం మీడియాకు వెల్లడించాయి.
సీఎం బసవరాజ బొమ్మై పీఏ(పర్సనల్ అసిస్టెంట్) హరీష్.. హనీట్రాప్‌కు గురయ్యాడు!. ఈ మేరకు విధానసౌధ పోలీస్ స్టేషన్‌లో జన్మభూమి ఫౌండేషన్ అధ్యక్షుడు నటరాజ్ శర్మ ఫిర్యాదు చేశారు. శాసన సభ నుంచే ఈ వలపు వల వ్యవహారం జరిగినట్లు ఫిర్యాదులో నటరాజ్ పేర్కొన్నారు. విధానసౌధ డీ-గ్రూపు మహిళా ఉద్యోగి ద్వారా ఓ ముఠా ఈ హనీట్రాప్‌కు పాల్పడినట్లు సమాచారం. హరీష్‌ను ట్రాప్ చేసిన ఆమె.. అతనితో ఏకాంతంగా గడిపింది.
ఆ వీడియోల ద్వారా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి.. హరీష్ నుంచి ప్రభుత్వానికి సంబంధించిన కీలక పత్రాలు ఆ ముఠా సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ పత్రాలు ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్లినట్లు ఫిర్యాదులో నటరాజ్ ప్రస్తావించారు. బెంగళూరు కనకపుర దగ్గర కోట్లు విలువ చేసే భూముల్ని సదరు మహిళా ఉద్యోగిణి పేరిట హరీష్ కొనుగోలు చేసినట్లు తేలిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. సీఎం పీఎం మాత్రమే కాదు.. చాలా మంది నేతలు, బ్యూరోక్రట్లపై కూడా హనీ ట్రాప్ జరిగిందని ఫిర్యాదులో నటరాజ్ పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై హరీష్‌ను పోలీసులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హరీష్‌గానీ, సీఎం కార్యాలయంగానీ, రాజకీయ పార్టీలుగానీ ఈ హనీ ట్రాప్ వ్యవహారంపై ఇంకా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment