- నేడు బెంగళూరులో మీడియా సమావేశం
- కర్ణాటక నూతన సీఎంగా డి.కె.శివకుమార్‌కు అవకాశం
- ఇక జాతీయ రాజకీయాల్లోకి సిద్ధరామయ్య
- ఎట్టకేలకు ఒప్పించిన కాంగ్రెస్ అధిష్టానం
- ఇరువురు నేతలతో ఢిల్లీలో పార్టీ పెద్దల చర్చలు
- పార్టీలో కీలక పాత్ర పోషించాలని సిద్ధరామయ్యకు వినతి
- సీఎం మార్పుపై ఇంకా అధికారికంగా స్పందించని కాంగ్రెస్
- అలాంటి చర్చ ఏదీ జరగలేదని స్పష్టికరణ
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పునకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ మధ్య ఇన్నాళ్లూ సాగిన కోల్డ్‌వార్‌కు కాంగ్రెస్ అధిష్టానం తెరదించబోతున్నట్లు సమాచారం. అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య గురువారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన బుధవారం బెంగళూరులో మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. రాజీనామాకు కారణాలు, రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వం, పార్టీ అధిష్టానం మధ్య ఢిల్లీలో కొన్నిరోజులుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని కాంగ్రెస్ పెద్దలు సూచించగా, సిద్ధరామయ్య అందుకు నిరాకరించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తామని, 2029 లోక్‌సభ ఎన్నికల ముందు సంస్థాగతంగా పార్టీలో కీలక పాత్ర పోషించాలని కోరగా ఆయన మెత్తబడినట్లు సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సామాజిక న్యాయం, కులాల సమైక్యత వ్యూహానికి పదును పెడుతున్నారు. బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
జాతీయ స్థాయిలో ఓబీసీ కీలక నాయకుల్లో ఒకరిగా సిద్ధరామయ్య ఎదగాలని కాంగ్రెస్ నాయకత్వం కోరుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ రాజకీయాల్లో తమ పార్టీ తరపున ఓబీసీల ప్రాతినిధ్యాన్ని పెంచాలని కాంగ్రెస్ యోచిస్తోంది. సీఎం పదవి నుంచి పక్కన పెట్టడాన్ని సిద్ధ రామయ్య పరపతి, ప్రాధాన్యతను తగ్గించే చర్యగా చూడొద్దని, ఆయనకు మరింత ఉన్నత స్థాయి అవకాశాలు కల్పిస్తున్నామని పార్టీ పెద్దలు పేర్కొంటున్నారు.
రాజకీయ భవిష్యత్తుపై అధిష్టానం హామీ
జాతీయ స్థాయిలో ఓబీసీ కులాల సమీకరణ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఢిల్లీలో పార్టీకి సిద్ధరామయ్య అవసరం ఉందని, అలాగే కాంగ్రెస్ దీర్ఘకాలిక ఎన్నికల వ్యూహంలో ఆయన రాజకీయ పలుకుబడి కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అలాగే రాజకీయ భవిష్యత్తుపై సిద్ధరామయ్యకు పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. సిద్ధరామయ్య, డీ.కే.శివకుమార్ మంగళవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ ఇంఛార్జ్ రణదీప్ సూర్జేవాలాతో సమావేశమయ్యారు. వారిద్దరూ తమ అనుకూల ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు.
ఈ భేటీలో సీఎం మార్పుపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కానీ, కాంగ్రెస్ నాయకులు మాత్రం రాజ్యసభ ఎన్నికలు, కర్ణాటక శాసన మండలి ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపైనే చర్చ జరిగినట్లు పైకి చెబుతున్నారు. రాజీనామాకు సిద్ధ రామయ్యను ఎట్టకేలకు ఒప్పించినట్లు తెలిసింది. కానీ, మీడియాలో వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని, వాటిలో ఏమాత్రం వాస్తవం లేదని కే.సీ.వేణుగోపాల్ అన్నారు. భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభ సీట్లు, మండలి సీట్ల గురించి చర్చించామని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన పక్కన సిద్ధరామయ్య, డీ.కే.శివకుమార్ కూడా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో రాజ్యసభ అభ్యర్థులతోపాటు కర్ణాటక రాజ్యసభ, మండలి స్థానాల అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని వేణుగోపాల్ చెప్పారు. సీఎం మార్పు నిజమేనా? అని ప్రశి్నంచగా, అది ఊహాగానమేనని సిద్ధరామయ్య బదులిచ్చారు. అలాంటి చర్చ ఏదీ జరగలేదన్నారు.
త్వరలో రాజ్యసభకు సిద్ధరామయ్య
కర్ణాటకలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచి్చంది. అప్పట్లో సీఎం పోస్టు కోసం సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్ తీవ్రంగా పోటీపడ్డారు. అధిష్టానం సిద్ధరామయ్యను ఎంపిక చేసింది. శివకుమార్ ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండేళ్ల తర్వాత సీఎంగా అవకాశం కల్పిస్తామని అప్పట్లో శివకుమార్‌కు అధిష్టానం హామీ ఇచి్చనట్లుగా ఆయన అనుచరులు చెప్పుకున్నారు. అయితే, దీనిపై అధిష్టానం ఏనాడూ బహిరంగంగా స్పందించలేదు. సీఎం మార్పు జరిగితే కొత్త సీఎంగా శివకుమార్‌కు ఎంపిక చేయడం తథ్యమని కర్ణాటక రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శివకుమార్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. శివకుమార్‌కు సీఎం పదవి కట్టబెట్టాలన్న ఆలోచనను సిద్ధరామయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నాయకత్వ సమస్యపై సిద్ధరామయ్య గానీ, శివకుమార్ గానీ బహిరంగంగా వ్యాఖ్యానించలేదు. కర్ణాటక సీఎంను మార్చే అంశంపై కాంగ్రెస్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కర్ణాటకలో ఇటీవల 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటికి జూన్ 18న ఎన్నికలు జరుగనున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలు గెల్చుకోనుంది. వాటిలో ఒక స్థానాన్ని సిద్ధరామయ్యతో భర్తీ చేస్తారని అంటున్నారు.


