సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం కర్ణాటక ప్రభుత్వం తరఫున అడ‍్వకేట్ జనరల్(ఏజీ) ప్రభులింగ్ నవాద్గీ వాదనలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
కేసు విచారణలో భాగంగా ఏజీ.. హిజాబ్ ఇస్లాం మతానికి అవసరమైన మతపరమైన ఆచారం కాదని, దాని ఉపయోగాన్ని నిరోధించడం మత స్వేచ్ఛను అడ్డుకున్నట్టు కాదన్నారు. మత స్వేచ్ఛకు హామీనిచ్చే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-25ను ఉల్లంఘించినట్టుకాదని చెప్పారు. హిజాబ్ లేదా కాషాయ కండువాలు ధరించకుండా నిషేధిస్తూ ఫిబ్రవరి 5న కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేసిన కొంతమంది ముస్లిం బాలికల చేసిన ఆరోపణలను ఏజీ తిరస్కరించారు.
రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారమే ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టుకు తెలిపారు. వారు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ క్రమంలో అన్ని వర్గాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పును వెల్లడించనుంది. ఈ వివాదంలో హైకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment