
మహేష్‌తో మాట్లాడుతున్న మంత్రి ( బాలుడికి ఉదాహరణగా చెప్పిన వలసకార్మికుడి కుమారుడు)(ఫైల్)
నీకేమైనా అయితే మీ అమ్మానాన్న, సోదరి ఏమైపోతారో ఎప్పుడైనా ఆలోచించావా?...
బెంగళూరు : నగరంలోని సోమసుందరపాల్యకు చెందిన 17 ఏళ్ల బాలుడు అక్కడి హెచ్‌ఆర్‌ఎస్ లేఅవుట్‌లోని ఓ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు. స్కూలు ఫీజు కట్టకపోవటంతో అతడ్ని తోటి విద్యార్థుల ముందు తిట్టడమే కాకుండా పరీక్షలు రాయటానికి ఒప్పుకోలేదు యజమాన్యం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతడ్ని కాపాడారు. అయితే ఈ కథ అంతటితో ముగిసిపోలేదు. బాలుడి ఆత్మహత్యాయత్నం విషయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్‌కుమార్ దృష్టికి వెళ్లింది. చలించిపోయిన ఆయన ఏకంగా బాలుడి ఇంటికే వెళ్లారు. (ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర)
గురువారం ఆయన బాలుడితో మాట్లాడుతూ.. ‘‘ నీకేమైనా అయితే మీ అమ్మానాన్న, సోదరి ఏమైపోతారో ఎప్పుడైనా ఆలోచించావా? నీ జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా నువ్వు ఎదురించగలగాలి. చచ్చిపోవాలనే ఆలోచనలు మానుకోవాలి. వలస కార్మికుడి కుమారుడు మహేష్ సంగతే చూడు! ఎస్ఎస్‌ఎల్‌సీలో అత్యధిక మార్కులు సాధించాడు. అతడి చదువును కొనసాగించడానికి అవసరమైన సహాయం చేయటానికి చాలా మంది ముందుకొచ్చారు. జీవితం అంటే అలా ఉంటుంది. కష్టాలు వచ్చినపుడు గుండె ధైర్యం కోల్పోకూడదు’’ అని ధైర్యం చెప్పాడు.