బెంగళూరు: కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్‌ను తను ఇప్పటి వరకు కలవలేదని కర్ణాటక గ్రామీణాభివృద్ధి మంత్రి కేఎస్ ఈశ్వరప్ప స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ మరణానికి తను బాధ్యుడిని కాదని అన్నారు. కాగా బెళగావి జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ తన చావుకు మంత్రి ఈశ్వరప్ప కారణమని లేఖ రాసి ఉడిపిలోని ఓ లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మంత్రి ఈశ్వరప్ప కమీషన్లు అడిగారని కాంట్రాక్టర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంతోష్ పాటిల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో మంత్రి ఈశ్వరప్పతోపాటు ఆయన మద్దతుదారులు బసవరాజ్, రమేశ్ పేర్లను కూడా చేర్చారు.
తాజాగా కాంట్రాక్టర్ చేసిన ఆరోపణలపై మంత్రి ఈశ్వరప్ప స్పందించారు. నేను ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌ను చూడలేదు, కలవలేదు. కేంద్రానికి రాసిన ఆ లేఖను మా శాఖకు పంపించారు. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా సమాధానమిచ్చారు. అయితే పాటిల్‌కు సివిల్ పనులు అప్పగించినట్లు ఎలాంటి రికార్డ్ లేదు. అలాగే పేమెంట్ గురించి కూడా చర్చించలేదు. ఇదే విషయాన్ని కేంద్రానికి కూడా తెలియజేశారు. నాపై వచ్చిన ఆరోపణలపై నిస్పక్షపాతంగా విచారణకు ఆదేశించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి, హోం మంత్రిని కోరాను’ అని ఈశ్వరప్ప తెలిపారు.
సంబంధిత వార్త: సూసైడ్ కలకలం: మంత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు.. రంగంలోకి సీఎం
కాగా కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ లాడ్జీలో మంగళవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మరణానికి ముందు తన చావుకు ఈశ్వరప్పే కారణమని, అతనికి శిక్ష పడాలని.. స్నేహితులకు వాట్సాప్ ద్వారా మెసెజ్‌లు పంపారు. తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి కోరారు. సంతోష్ పాటిల్ ఆత్మహత్యతో ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు ఊపందుకున్నాయి. దీంతో ఈశ్వరప్ప రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి స్పందించారు. తను రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సంతోష్ పాటిల్ ఆరోపణలపై పరువు నష్టం కేసు కూడా వేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment