శ్రీనగర్: మూడు రోజుల పర్యటనలో భాగంగా జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. పర్యటనలో చివరి రోజు సోమవారం నాడు ఆయన షేర్ ఈ కశ్మీర్ ఇంటర్నెషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. దీనికి ముందు అమిత్ షా చేసిన పని అక్కడున్నవారందరిని ఒకింత భయానికి గురి చేసింది. అదేంటంటే వేదిక మీదకు ఎక్కి ప్రసంగించడానికి ముందు అమిత్ షా తాను ధరించిన బుల్లెట్ ప్రూఫ్‌షీల్డ్‌ని తొలగించారు. అమిత్ షా చేసిన పనికి అక్కడున్నవారంతా షాకయ్యారు.
(చదవండి: వారిని మనమే కాపాడుకోవాలి!)
అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘నన్ను దూషించారు, అడ్డుకున్నారు. కానీ నేను జమ్మూకశ్మీర్ ప్రజలతో సూటిగా, స్పష్టంగా మాట్లాడాలనుకున్నాను. అందుకే బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్, సెక్యూరిటీని తొలగించాను. ఫరూఖ్ సాహెబ్ నన్ను పాకిస్తాన్‌తో మాట్లాడమని సూచించారు. కానీ నేను కశ్మీర్ లోయలో ఉన్న యువత, ప్రజలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను’’ అని తెలిపారు.
చివరి రోజు పర్యటనలో భాగంగా అమిత్ షా సోమవారం ఉదయం గండెర్‌బాల్ జిల్లాలో ఉన్న ఖీర్ భవానీ ఆలయంలో పూజలు నిర్వహించారు. అలానే అమిత్ షా కశ్మీర్ ఫెరాన్ మాదిరి దుస్తులు ధరించి.. మాతా రంగ్యాదేవి ఆలయంలో పూజలు నిర్వహించారు. కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అమిత్ షాతో పాటు ఆలయాన్ని సందర్శించారు.
(చదవండి: అభివృద్ధికి విఘాతం కలిగిస్తే సహించం)
కశ్మీర్ పర్యటనలో భాగంగా తొలి రోజు శనివారం అమిత్ షా ఈ ఏడాది జూన్‌లో మిలిటెంట్ల చేతిలో హతమైన పోలీసు అధికారి పర్వీజ్ అహ్మద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల కాలంలో లోయలో పెరిగిన చొరబాట్లు, పౌరుల హత్యల నేపథ్యంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్‌భవన్‌లో జరిగిన సమావేశంలో అమిత్‌షా భద్రతా పరిస్థితులను కూడా సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment