- నిర్ధోషిగా నిరూపణయ్యేవరకు సీఎం పదవిలో ఉండను
- త్వరలో కొత్త సీఎం పేరు ప్రకటిస్తా
- నవంబర్‌లో ఢిల్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్
- ఓటర్లే భవిష్యత్ నిర్ణయిస్తారని సంచలన ప్రకటన
- లిక్కర్ కేసులో రెండు రోజుల క్రితమే బెయిల్‌పై రిలీజైన కేజ్రీవాల్
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని బాంబు పేల్చారు. లిక్కర్ స్కామ్ కేసులో నిర్దోషిగా నిరూణ అయ్యేవరకు సీఎం పదవి చేపట్టనని స్పష్టం చేశారు. ఆదివారం(సెప్టెంబర్15) ఢిల్లీలో జరిగిన ఆమ్‌ఆద్మీపార్టీ సమావేశంలో కేజ్రీవాల్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించండి. నేను అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నా. నా భవిష్యత్తును ఓటర్లే నిర్ణయిస్తారు. నేను నిజాయితీగా ఉన్నానని భావిస్తేనే నాకు ఓట్లు వేయండి.’అని కేజ్రీవాల్ కోరారు.
‘రాజ్యాంగాన్ని రక్షించేందుకే ఇన్ని రోజులు సీఎం పదవికి రాజీనామా చేయలేదు. కొత్త సీఎం పేరును త్వరలో ప్రకటిస్తాం. నేను, సిసోడియా సీఎం పదవిలో ఉండం. ఆమ్‌ఆద్మీపార్టీని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఇందులో భాగంగానే నన్ను జైలుకు పంపించింది’అని కేజ్రీవాల్ అన్నారు.
కాగా, లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ రెండు రోజుల క్రితమే సుప్రీంకోర్టు బెయిలివ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే బెయిల్ షరతుల ప్రకారం కేజ్రీవాల్ సీఎం ఆఫీసుకు వెళ్లడానికి వీళ్లేదని కోర్టు ఆదేశించింది.
మరోపక్క బీజేపీ కేజ్రీవాల్ రాజీనామాకు డిమాండ్ చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఇదీ చదవండి.. తమిళనాడులో రాముడంటే తెలియదు: గవర్నర్ రవి
Comments
Please login to add a commentAdd a comment