మలప్పురం: వావీవరుసలు లేకుండా ప్రవర్తించే మృగాల పట్ల కఠినంగా వ్యవహారించాల్సిన అవసరం ఉంటుందని కేరళలోని ఓ స్థానిక కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కన్నతండ్రి ముసుగుతో దారుణానికి పాల్పడ్డ ఓవ్యక్తికి ఏకంగా మూడు యావజ్జీవ ఖైదుల శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది.
కేరళ మంజేరీ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు 2021లో జరిగిన ఓ ఘోరానికి గానూ తాజాగా శిక్ష ఖరారు చేసింది. కన్నకూతురిపైనే మృగవాంఛ తీర్చుకున్న ఓ వ్యక్తికి మూడు జీవిత ఖైదుల శిక్ష విధిస్తూ.. జీవితాంతం అతను జైల్లోనే మగ్గాలని తేల్చి చెప్పింది. పోక్సో చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఈ శిక్షలు ఖరారు చేస్తున్నట్లు న్యాయమూర్తి రాజేష్ కే వెల్లడించారు. అంతేకాదు నిందితుడికి ఆరున్నర లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నట్లు తెలిపారాయన.
మార్చి 2021లో తొలిసారిగా బాలికపై లైంగిక దాడి జరిగింది. కరోనా సమయంకావడంతో ఆమె ఆన్‌లైన్‌లో క్లాసులు వింటోంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేనిది గమనించిన ఆమె తండ్రి.. కూతురిని లాక్కెళ్లి బెడ్‌రూమ్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెప్తే.. తల్లిని చంపేస్తానని బెదిరించాడు. అలా ఆరు నెలలపాటు సొంత కూతురిపైనే అతను పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఆపై కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆమె గర్భవతి అనే షాకింగ్ విషయం తేలింది. దీంతో కన్నతండ్రే ఆ పాపానికి ఒడిగట్టాడని వాపోయింది బాధితురాలు. వెంటనే వాలిక్కడవు పోలీసులను ఆశ్రయించిన ఆ తల్లి.. భర్తపై ఫిర్యాదు చేసి కటకటాల వెనక్కి నెట్టింది. వైద్య పరీక్షల్లో(డీఎన్‌ఏ అనలైసిస్) ఆ వ్యక్తే లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. ఆలస్యం జరగకుండా ఉండేందుకు.. ఫాస్ట్ ట్రాక్ ద్వారా కోర్టు ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment