న్యూఢిల్లీ: కోళీకోడ్ ఘోర విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో పౌర విమానయాన శాఖ శుక్రవారం రాత్రి ఎయిర్ ఎండియా ఎక్స్‌ప్రెస్, పౌర విమానయాన నియంత్రణ సంస్థ(డీజీసీఏ) అధికారులతో ఢిల్లీలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ విషాదకర ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాల్సిందిగా ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ)ను ఆదేశించింది. కాగా ఏఐఈఏఎక్స్‌బీ-1344 బోయింగ్ 737 విమానం ప్రమాదానికి లోనైనట్లు డీజీసీఏ తెలిపింది. వందేభారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వేపై ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి లోయలో పడినట్లు వెల్లడించింది. అయితే ఈ ప్రమాదం తమ నెట్‌వర్క్‌పై ప్రభావం చూపినా, వందేభారత్ మిషన్ కొనసాగుతుందని పేర్కొంది.(రెండు ముక్కలైన విమానం )
కేరళలో శుక్రవారం రాత్రి ఎయిర్ ఇండియా విమానం రెండు ముక్కలైన ఘటనలో పైలట్ కెప్టెన్ దీపక్ సాథే, కో- పైలట్ అఖిలేశ్ కుమార్ సహా 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 125 మందికి పైగా క్షతగాత్రులు కాగా.. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై వెంటనే స్పందించిన రక్షణా బృందాలు సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆస్పత్రికి తరలించాయి. ఘటనాస్థలిలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తైందని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించడంతో పాటుగా విమాన శిథిలాల కింద చిక్కుకున్న వారిని కూడా బయటకు తీసినట్లు మలప్పురం కలెక్టర్ వెల్లడించారు.
మరోవైపు.. ఈ ఘటనలో మరణించిన, గాయపడిన ప్రయాణీకులు, సిబ్బంది వివరాలకై షార్జా, దుబాయ్‌ల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. +971565463903, +9715430 90572, +971543090575 హెల్ప్‌లైన్లు ప్రారంభించారు. అదే విధంగా కేరళలోని బాధితుల కుటుంబ సభ్యుల కోసం 0495–2376901 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు కోళీకోడ్ కలెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment