ఫిరాయింపులపై వారంలో సుప్రీంకు..! | KTR met legal experts in Delhi | Sakshi
Sakshi News home page

ఫిరాయింపులపై వారంలో సుప్రీంకు..!

Published Tue, Jul 23 2024 4:32 AM | Last Updated on Tue, Jul 23 2024 4:32 AM

KTR met legal experts in Delhi

ఢిల్లీలో న్యాయనిపుణులతో భేటీ అయిన కేటీఆర్‌

హైకోర్టులో జాప్యం అవుతుండటంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తున్నాం

కవిత అనారోగ్యానికి గురై బరువు తగ్గడం బాధగా ఉందని వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై వారం రోజుల్లో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే లపై స్పీకర్‌ అనర్హత వేటు వేయడంలో జాప్యం చేయడం సరికాదన్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ అనుసరిస్తున్న విధానాలను దేశవ్యాప్తంగా తెలియ చెబుతామని పేర్కొన్నా రు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణలో జరుగుతున్న ఫిరాయింపులపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. 

సోమవారం సోదరి, ఎమ్మెల్సీ కవితను తీహార్‌ జైలులో కలిసేందుకు వచ్చిన కేటీఆర్‌.. సుప్రీంకోర్టుకు చెందిన న్యాయనిపు ణులతో భేటీ అయ్యి, ఫిరా యింపులపై సుదీర్ఘంగా చర్చించారు. దానం నాగేందర్‌ వ్యవహారంపై తాము ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించామని, అక్కడ చాలారోజుల నుంచి జాప్యం జరుగుతోందని కేటీఆర్‌ చెప్పారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ ఫిర్యాదు మేరకు అక్కడి స్పీకర్లు వారిపై అనర్హత వేటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

ఇతర రాష్ట్రాల్లో పార్టీని వీడి మరొక పార్టీలోకి చేరిన వారిపై పోరాటాలు చేస్తున్న కాంగ్రెస్‌.. తెలంగాణలో ఫిరాయింపులకు ఎందుకు పాల్పడుతోందని ప్రశ్నించారు. వాషింగ్‌ మెషీన్‌ పార్టీగా బీజేపీని విమర్శిస్తున్న కాంగ్రెస్‌ తెలంగాణలో వ్యవహరిస్తున్న తీరును ఏవిధంగా సంబోధించాలో చెప్పాలన్నారు. ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టుకు చెందిన న్యాయ నిపుణులకు అన్ని ఆధారాలను ఇచ్చామని, సుప్రీంకోర్టులో ఫైట్‌ చేయనున్నట్లు కేటీఆర్‌ వివరించారు.

రాజ్యసభలో గళం విప్పుతాం
తమ పార్టీ గుర్తుపై గెలిచిన వారిని కాంగ్రెస్‌ చేర్చుకోవడంపై రాజ్యసభలో గళం విప్పుతామని కేటీఆర్‌ చెప్పారు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ప్రతీ ఒక్కరిపై అనర్హత వేటు వేయాల్సిందేనని, ఆ దిశగా తాము న్యాయ పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. రాజ్యసభ, లోక్‌సభలో అనుభవజ్ఞులైన సభ్యులున్నారని వారితో ఫిరాయింపులపై ఓ కమిటీని వేయాలంటూ రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌ రెడ్డి అఖిలపక్ష సమావేశం దృష్టికి తీసుకెళ్లినట్లుగా పేర్కొన్నారు. 

బరువు తగ్గిన కవిత 
సోదరి కవితను కలిశానని, అనారోగ్యం నుంచి ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని కేటీఆర్‌ చెప్పారు. ఆమె దాదాపు 7–10 కిలోల బరువు తగ్గిందని, బలహీనంగా కనిపించడం వల్ల బాధ కలిగిందన్నారు. 130 రోజులుగా న్యాయం కోసం తన సోదరి జైల్లో పోరాడుతోందని చెప్పారు. కవిత కొద్దిరోజుల్లో కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తంచేశారు.  మరో వైపు ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీని  ఈ నెల 26 వరకూ ట్రయల్‌ కోర్టు పొడిగించింది. 

నూతన నేర చట్టాలపై మీ వైఖరేంటి?
రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌కు కేటీఆర్‌ ప్రశ్న
పలు నిబంధనలు, సెక్షన్లు వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉన్నాయి
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటకలో వీటి అమలుపై వ్యతిరేకత
నియంతృత్వ సెక్షన్లపై రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి పంపాలని డిమాండ్‌
సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చిన నేర చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ తమ వైఖరి వెల్లడించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో కొత్తగా వచ్చిన భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌ఏ)పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. 

నూతన న్యాయ చట్టాలపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో నియంతృత్వ సెక్షన్లపై రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి పంపాలని కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు సోమవారం కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. ఈ చట్టాల్లోని పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్నాయన్నారు. ఈ చట్టాలు పోలీసులు, ప్రభుత్వానికి మితిమీరిన అధికారాన్ని కట్టబెట్టేలా ఉన్నాయని, వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని హక్కుల సంఘాలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. 

ప్రజాస్వామికవాదులు, న్యాయ నిపుణులతోపాటు పలు రాష్ట్రాలు కూడా నూతన చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశారని పేర్కొన్నారు.

తొందరపాటు చట్టాలు
దేశవ్యాప్తంగా విస్తృత స్థాయి సంప్రదింపులు జరపకుండానే కేంద్రం తొందరపాటుతో ఈ చట్టాలను తెచ్చిందని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటు ఉభయ సభల నుంచి 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేసి ఆమోదించిన ఈ చట్టాలపై ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నాయకులతోపాటు పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయన్నారు. 

ప్రజల హక్కులు, స్వేచ్ఛను హరించేలా ఉన్న ఈ చట్టాలతో నిందితులకు బెయిల్‌ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయన్నారు. ప్రభుత్వచర్యలకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలపై కేసుల నమోదు అధికారం వచ్చిందన్నారు. సైబర్‌ నేరాలు, హ్యాకింగ్, ఆర్థిక నేరాలు, గోప్యత, సాంకేతికత ద్వారా విధ్వంసం వంటి వాటి కోసం రూపొందించిన ప్రత్యేక అధ్యాయంలో అనేక అస్పష్టతలున్నాయని పేర్కొన్నారు. 

ఏడు నెలలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న విద్యార్థులను, యువకులను, నిరుద్యోగులను, సోషల్‌ మీడియా కార్యకర్తలను ఎక్కడికక్కడ అణిచివేసేందుకు సర్కారు పోలీసులను విస్తృతంగా వినియోగిస్తోందన్నారు. నూతన చట్టాల నేపథ్యంలో ఈ పరిణామాలు మరింత దుర్మార్గమైన వాతావరణానికి దారితీస్తాయని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement