సాక్షి, న్యూఢిల్లీ: ఎంతో పవిత్రమైన గంగా నదిలో స్నానం చేస్తే చేసుకున్న పాపాలు పోతాయని పెద్దలు చెప్పిన మాట ఏమో కానీ, ప్రస్తుతం మహా కుంభ్‌మేళాలో స్నానాలు చేస్తున్న వారిలో అనేక మంది వైరస్ బారినపడుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో గంగానది పుణ్య స్నానాలు ప్రజల పాలిట పాపాలుగా మారుతున్నాయి. గంగా స్నానం చేసి తమ ప్రాంతాలకు తిరిగి వెళుతున్న అనేక మందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనుమానం వ్యక్తం చేశాయి. కుంభ్‌మేళాలో పాల్గొని తిరిగి వస్తున్న యాత్రికులకు కర్ణాటక ప్రభుత్వం ఆర్టీ–పీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేసింది. కుంభ్‌మేళాలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనాతో ‘నిర్వాణి అఖాడా’ సాధువు మృతి
తాజాగా మహా కుంభ్‌మేళాలో పాల్గొన్న నిర్వాణి అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ కపిల్‌దేవ్ కరోనా సంక్రమణతో గురువారం మరణించారు. కుంభమేళాలో పాల్గొనేందుకు మధ్యప్రదేశ్ నుంచి ఆయన హరిద్వార్‌కు వెళ్ళారు. అయితే అక్కడ కుంభ్‌మేళాలో పాల్గొన్న అనంతరం జరిపిన పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయనకు డెహ్రాడూన్లోని కైలాష్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆసుపత్రి అధికారులు అందించిన సమాచారం ప్రకారం మహా మండలేశ్వర్ కపిల్‌దేవ్ గురువారం కరోనాతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. కుంభ్‌మేళా సమయంలో కరోనా వైరస్ సంక్రమణతో మరణించిన మొదటి ప్రధాన సాధువు కపిల్ దేవ్.
మరోవైపు సునామీలా దూసుకెళ్తున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో ప్రజలను సామూహిక ప్రదేశాలకు వెళ్ళకుండా అప్రమత్తం చేయాల్సింది పోయి, ఈ నెలాఖరు వరకు షెడ్యూల్ ప్రకారం కుంభ్‌మేళా కొనసాగుతుందని అధికారులు చేసిన ప్రకటనపై విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ కుంభ్‌మేళాను మర్కజ్‌తో పోల్చరాదని చేసిన వ్యాఖ్య పెద్ద ఎత్తున దుమారానికి కారణమైంది. సంక్రమణ వేగానికి అడ్డుకట్టవేసేందుకు ఎక్కువమంది ఒకే ప్రాంతంలో గుమికూడరాదని చెబుతున్నప్పటికీ, దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లో జరుగుతున్న మహా కుంభ్‌మేళాలోని పరిస్థితులు అందరిని భయపెడుతున్నాయి.
ఈ నెల 27న చివరి షాహీ స్నానాలు
హరిద్వార్‌లో జరుగుతున్న కుంభ్‌మేళాలో రోజూ లక్షల సంఖ్యలో భక్తులు గంగా స్నానం కోసం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన మూడు షాహీ స్నానాల సమయంలో ఒక్కరోజులో కనీసం 20 లక్షల మంది హాజరయ్యారని అధికారులు అంచనా వేశారు. కుంభమేళాలో ఈ నెలలో మరో ముఖ్యమైన తేదీ అయిన 27న చైత్ర పౌర్ణమి సందర్భంగా షాహీ స్నానాలు చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈనెలాఖరు వరకు జరుగనున్న కుంభ్‌మేళాను రెండు వారాల ముందుగానే ముగిస్తారని జరిగిన ప్రచారంపై ప్రభుత్వం, మత పెద్దల మధ్య చర్చలు జరిగాయి. మహా కుంభ్‌మేళా కార్యక్రమం రద్దుకు సాధువులు అంగీకారం తెలుపలేదు.
కుంభమేళా సాధారణంగా జనవరిలోనే ప్రారంభం కావాల్సి ఉండగా, కోవిడ్‌తో ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సూచిస్తున్నప్పటికీ అత్యధిక శాతం మంది పట్టించుకున్న దాఖలాలే లేవు. లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతున్న మహా కుంభ్‌మేళాలో కరోనా పరీక్షలు చేస్తున్నప్పటికీ, అవి నామమాత్రంగానే ఉన్నాయి. దీంతో కుంభ్‌మేళా సూపర్ స్ప్రెడర్‌గా మారిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఉత్తరాఖండ్ కోవిడ్ స్టేట్ కంట్రోల్ రూమ్ గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 10 నుంచి, 14వ తేదీ వరకు హరిద్వార్‌లో పరీక్షలు చేయించుకున్న వారిలో 2,167 మందిని పాజిటివ్‌గా గుర్తించారు. కేసులు పెరుగుతున్న కారణంగా హాజరయ్యేవారి సంఖ్యను పరిమితం చేసే అవకాశంపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
ఇక్కడ చదవండి:
బెంగళూరులో శ్మశానాలన్నీ ఫుల్.. రుద్రభూముల్లో మృతదేహాల క్యూలు
Comments
Please login to add a commentAdd a comment