హరిద్వార్ : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్నకారణంగా వలస కార్మికులు, పర్యాటకులు, ఇతర రాష్ట్రాలకు చెందిన యాత్రికులు సహా 60 వేల మందికి పైగా ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది వలస కార్మికులు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వీరిలో చాలామంది ప్రధాన పారిశ్రామిక కేంద్రాలుగా ఉన్న హరిద్వార్ మరియు యూఎస్ నగర్ సరిహద్దు జిల్లాల్లో చిక్కుకుపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. హరిద్వార్ జిల్లాలో 5వేల మంది, యూఎస్ నగర్‌లో 50 వేల మంది కార్మికులు చిక్కుకుపోయినట్టుగా అధికారులు వెల్లడించారు.
ఇందుకు సంబంధించి హరిద్వార్ డీఐఓ అర్చన మాట్లాడుతూ.. జిల్లాలో చిక్కుకుపోయిన 5 వేల మంది బాగోగులను జిల్లా యంత్రాంగం చూసుకుంటుందని తెలిపారు. జిల్లాలో చిక్కుకుపోయిన కార్మికులు ఉత్తరప్రదేశ్, బీహార్‌లతో పాటు ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలకు చెందినవారని చెప్పారు. హరిద్వార్‌లోని పలు పారిశ్రామిక విభాగాల్లో పనిచేయడానకి వీరు వచ్చినట్లుగా గుర్తించామని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే అంతరాష్ట్ర రవాణాను నిలిపివేసినందున వారు ఇక్కడే చిక్కుకుపోయారని వివరించారు. వీరిలో కార్మికులు కాకుండా వెయ్యి మందికిపైగా టూరిస్టలు, ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఉన్నట్లు ఆమె వెల్లడించారు.
యూఎస్ నగర్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ప్రశాంత్‌సింగ్ మాట్లాడుతూ.. ‘జిల్లాలో చిక్కుకుపోయినవారిలో ఎక్కువ మంది మంది కార్మికులు ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు, రాష్ట్రంలోని కొండ ప్రాంతాలకు చెందినవారు ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్నారు. వీరి సంఖ్య 80 వేల నుంచి లక్ష వరకు ఉంటుంది. ఇందులో చాలా మంది వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇక్కడ చిక్కుకున్నవారికి ఆహారం అందిస్తున్నాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment