వారికీ చట్టపరమైన రక్షణ కావాలి
ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెక్కీ సోదరుడి ఆవేదన
బెంగళూరు: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెక్కీ సోదరుడు భావోద్వేగంతో ప్రకటన చేశారు. మహిళల ప్రాణాలు ఎంత ముఖ్యమో పురుషుల ప్రాణాలూ అంతే ముఖ్యమని, పురుషుల రక్షణ కోసమూ చట్టం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. తన సోదరుడి ఆత్మహత్య సంఘటన తీవ్రత ఉన్నప్పటికీ, ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వేధింపులు అనుభవిస్తున్న పురుషుల కోసం చట్టాలు రూపొందించాలన్నారు. ‘నా సోదరుడికి న్యాయం చేయాలి. పురుషులు కూడా వేధింపులకు గురవుతున్నారు. వారి కోసం కూడా చట్టాలు చేయాలి. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. స్త్రీ ప్రాణం ఎంత ముఖ్యమో పురుషుడి ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. చట్టపరంగా ముందుకెళ్తాం’అని తెలిపారు.
సుభాష్‌ను అత్తమామలు చిత్రహింసలకు గురిచేస్తున్నారని తమకు తెలుసని, కానీ అతను ఇలాంటి చర్యకు పాల్పడతాడని తాము ఊహించలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా... భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే బెంగళూరు టెక్కీ ఆత్మహత్యకు పాల్పడినట్లు వైట్ ఫీల్డ్ డీసీపీ శివకుమార్ ధ్రువీకరించారు. ‘అతనిపై ఉత్తరప్రదేశ్‌లో పలు కేసులు నడుస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి అతని భార్య, ఆమె కుటుంబ సభ్యులు అతని నుంచి డబ్బు డిమాండ్ చేశారు. ఆ కారణాలతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు మారతహళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. దర్యాప్తు కొనసాగుతోంది’అని ఆయన వెల్లడించారు.
ఛితాభస్మాన్ని కలపొద్దు
డిసెంబర్ 9న బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 34 ఏళ్ల అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోవడానికి ముందు ఆయన 24 పేజీల సూసైడ్ నోట్ రాశారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ ఫ్యామిలీ కోర్టు జడ్జి తన వాదనను వినడం లేదని, కోర్టులోని ఓ అధికారి జడ్జి ముందు లంచం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన సంఘటనలను ఆయన పూసగుచ్చినట్లు వివరించారు.
భార్య నికిత తనపై హత్య, లైంగిక వేధింపులు, డబ్బు కోసం వేధించడం, గృహ హింస, వరకట్నం సహా తొమ్మిది కేసులు పెట్టిందని సుభాష్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. తన నాలుగేళ్ల కుమారుడిని తనకు దూరంగా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డను తన తల్లిదండ్రులకు అప్పగించాలని కోరారు. న్యాయం జరిగేవరకు తన చితాభస్మాన్ని నిమజ్జనం చేయొద్దని కుటుంబ సభ్యులను కోరుతూ సుభాష్ ఓ వీడియోను రికార్డు చేశారు.
మృగంలా ప్రవర్తించారు: నికిత ఆరోపణ
ఆత్మహత్యపై నేపథ్యంలో 2022లో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన వివరాలు బయటకొచ్చాయి. జౌన్‌పూర్‌కు చెందిన నికితకు 2019లో బిహార్‌కు చెందిన సుభాష్‌తో వివాహం జరిగింది. వీరు బెంగళూరులో ఉంటూ అక్కడే పనిచేసేవా రు. తన భర్త అతుల్ తనను కొట్టేవాడని, భార్యాభర్తల సంబంధం విషయంలో మృగంలా ప్రవర్తించేవాడని నికితా సింఘానియా ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లిలో ఇచి్చన కట్నంతో సంతృప్తి పొందక మరో 10 లక్షలు డిమాండ్ చేశారన్నారు.
కట్నంకోసం తనను శారీరకంగా, మానసికంగా హింసించారని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులకు చెబితే సర్దుకుని పోవాలని సూచించేవారని ఫిర్యాదులో వెల్లడించారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదని, మద్యం తాగి భర్త తనను కొట్టడం ప్రారంభించాడని, బెదిరించి తన జీతం మొత్తాన్ని అతని ఖాతాకు బదిలీ చేసుకునేవారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అత్తామామలు పదేపదే వేధించడం వల్లే తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని, 2019 ఆగస్టు 17న గుండెపోటుతో మరణించారని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment